కునాల్ కౌశిక్ . ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, 'పటాస్' సద్దామ్, కె. నరసింహ, ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు (Cast)
ఆనంద్ బడా (Director)
యాదగిరి రాజు (Producer)
బికాజ్ రాజ్ (Music)
రాకేష్ (Cinematography)
Release Date : అక్టోబర్ 27, 2023
ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. గత వారం రిలీజ్ అయిన పెద్ద సినిమాల హవా ఇంకా తగ్గకుండానే చిన్న సినిమాలు క్యూలు కడుతుండటం విశేషం. ఇందులో కాస్తో కూస్తో తెలిసిన మొహాలు ఉన్న సినిమాలుగా సంపూర్ణేష్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’, కార్తీక్ రత్నం ‘లింగోచ్చా’ నిలిచాయి. ‘కేరాఫ్ కంచెరపాలెం’ ‘నారప్ప’ ‘ఛాంగురే బంగారు రాజా’ వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రత్నం. మరి ఈ ‘లింగోచ్చా’ తో అతను హిట్టు కొట్టాడా? సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకుందాం రండి :
కథ : దగడ్ శివ (కార్తీక్ రత్నం) హైదరాబాద్, పాతబస్తీ పోరడు. అతను ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. కుర్రాళ్లందరికీ హెయిర్ స్టైలింగ్ బాగా చేస్తుంటాడు అనే పేరు సంపాదించుకుంటాడు. మరోపక్క దోస్తులతో తాగుతూ, తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఇతని చిన్నప్పుడే లింగోచ్చా ఆడుతూ.. అంటే 7 పెంకులు ఆట ఆడుతూ నూర్జహ (సుప్యర్థ సింగ్) అనే ముస్లిం అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ ఆమెని తన తల్లిదండ్రులు దుబాయ్ కి పంపిస్తారు.
అప్పటి నుండి రోజూ శివ హీరోయిన్ ఇంటికి వెళ్లి ఆమె వచ్చిందా లేదా చెక్ చూస్తూ ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత ఆమె హైదరాబాద్ కి తిరిగొస్తుంది. ఈ విషయం తెలుసుకుని అతను సంతోషపడి ఆమెకు ఎలాగైనా తన ప్రేమ గురించి చెప్పాలని ప్రత్నిస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఆమె కూడా ఇతని ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత వీళ్ళ ప్రేమ వ్యవహారం నూర్జహ తండ్రి అలాగే ఆమె అన్న(అన్వర్) కి తెలుస్తుంది. ఈ క్రమంలో అన్వర్.. శివని చితక్కొడతాడు.
అయినా శివ తగ్గడు. తర్వాత అతని పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి కొట్టిస్తారు. ఈ విషయం తెలుసుకున్న నూర్జహ .. శివ బయటకి వచ్చిన తర్వాత దుబాయ్ కి పారిపోదామని చెబుతుంది. మరి ఫైనల్ గా వీళ్ళు అనుకుంది.. జరిగిందా? వీరి ప్రేమని గెలిపించుకున్నారా? లేదా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : నాటకాలతో కెరీర్ ప్రారంభించిన కార్తీక్ రత్నం ‘కంచెరపాలెం’ తో డీసెంట్ సక్సెస్ అందుకుని ఓకే అనిపించాడు. కానీ సోలో హీరోగా ఇంకా హిట్టు అందుకోలేదు. ఇక ఈ ‘లింగోచ్చా’ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగానే చేశాడు. అయితే హీరోకి ధీటుగా అన్వర్ పాత్ర అంటే విలన్ పాత్ర చేసిన కునాల్ కౌశిక్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు అని చెప్పాలి. గతంలో ఇతన్ని ’16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్’ ‘ఘాజీ’ ‘అంతరిక్షం’ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ‘పిట్ట కథలు'(వెబ్ సిరీస్) లలో చూశాం.
కానీ ‘లింగోచ్చా’ లో అతనికి కొంచెం ఎక్కువ నిడివి కలిగిన పాత్ర దొరికింది. భవిష్యత్తులో ఇతనికి ఇంకా మంచి పాత్రలు దొరికే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ గా చేసిన సుప్యర్థ సింగ్ నటన ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఆమె లుక్స్ కూడా పెద్దగా ఆకర్షించవు. మిగిలిన నటీనటుల్లో తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు తప్ప.. మిగిలిన వాళ్ళు పెద్దగా గుర్తుంచుకునే పాత్రలు చేయలేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ఆనంద్ బడా రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ కథని చెప్పాలి అనుకోవడం కొత్త ప్రయత్నం. ఫస్ట్ హాఫ్ ను అతను నడిపించిన తీరు బాగుంది. కొన్ని సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్ ను ఇతను గాలికొదిలేసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, అందుకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఆనంద్. కానీ కథనం ఆసక్తికరంగా లేనప్పుడు ఈ సెటప్పులు హైలెట్ అవ్వవు. ఇక క్లైమాక్స్ లో ట్రాజెడీని పెట్టి కాస్త ఇబ్బంది పెట్టాడు.
ఇలాంటి క్లైమాక్స్ ను పెట్టాలి అనుకోవడమే పెద్ద సాహసం. తమిళ సినిమాల్లో అయితే పర్వాలేదు కానీ తెలుగులో ఇలాంటి క్లైమాక్స్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కష్టం. మ్యూజిక్ పరంగా చూసుకుంటే బికాజ్ రాజ్ పనితనం బాగుంది. పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగానే ఉన్నాయి.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో శ్రద్ద తీసుకోవాల్సింది. హైదరాబాద్ పాతబస్తి లొ లొకేషన్స్ ఓకే కానీ దుబాయ్ లొకేషన్స్ చూసినప్పుడు మాత్రం ప్రొడక్షన్ డిజైన్ వీక్ అని తెలిసిపోతుంది.
విశ్లేషణ: ‘లింగోచ్చా’.. (Lingoccha) ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని.. ఫస్ట్ హాఫ్ పరంగా మెప్పించొచ్చు. క్లైమాక్స్ కొత్తగా ట్రై చేసినా ట్రాజెడీ ఎక్కువవ్వడంతో అది ప్రయోగంగానే మిగిలిపోతుంది. థియేటర్లలో కష్టం కానీ.. ఓటీటీలో అయితే ఈ సినిమాని ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus