‘కూలీ’ సినిమా గురించి ఇన్నాళ్లూ మాట్లాడని దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. సినిమాలో ముఖ్య విషయాలను, ఆసక్తికర అంశాల గురించి మాట్లాడుతున్నాడు. సినిమా విడుదలకు పట్టుమని 10 రోజులు కూడా లేకపోవడంతో ఇంట్రెస్టింగ్ పాయింట్లు బయటకు వస్తున్నాయి. అలా ఈ సినిమాలో ఓ సీన్ కోసం రెండేళ్లు కష్టపడ్డామని చెప్పారాయన. ఈ నెల 14న థియేటర్లలో ‘కూలీ’ వచ్చాక మీకే తెలుస్తుంది అని కూడా అంటున్నారు.
‘కూలీ’ సినిమా ఇంటర్వెల్ సీన్‌కు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రజనీకాంత్‌ను తొలిసారి డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ స్పెషల్‌గా ఉండాలని అనుకున్నాను. అందుకే ఆ సీన్ ప్లానింగ్ రెండేళ్లపాటు సాగింది అని చెప్పారు. ‘విక్రమ్’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఇప్పటికే ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. మరి ‘కూలీ’లో ఎలా రాసుకున్నారో చూడాలి.
ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ సీన్ ఒకటి రజనీకాంత్‌కు చూపించారట లోకేశ్. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడలేదట. కానీ మరుసటి రోజు స్వీట్లు ఆర్డర్ చేసి మరీ శ్రుతికి ఇచ్చారట. అంతలా ఆయన ఆమె నటన నచ్చింది అని చెప్పారు లోకేశ్. శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలో విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించిన మాట వాస్తవమే అని లోకేశ్ తేల్చారు.
ఆ సినిమా దర్శకురాలు సుధా కొంగరను రెండు సార్లు కలిశానని, ఆమె చెప్పిన కథ కూడా నచ్చిందని.. నటించాలనే ఆలోచన నాకూ ఉందని. కానీ ‘కూలీ’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ సినిమా రిజెక్ట్ చేశా అని చెప్పారు. అయితే ‘కూలీ’ సినిమా పనులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత.. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తా అని చెప్పారు.
ఈ సినిమా తర్వాత ‘ఖైదీ 2’ సినిమా పనులు మొదలుపెడతానని తెలిపారు. కార్తి హీరోగా ఈ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.