Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?
- September 7, 2026 / 08:57 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ఇద్దరు సీనియర్ వైవిధ్యమైన దర్శకులు కలసి పని చేయబోతున్నారు. అదే ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఇదేంటి ఇంతుంది పేరు అనుకుంటున్నారా? అదే కదా చెప్పాం.. పొడవైన టైటిల్ అని. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన చంద్ర సిద్ధార్థ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Chandra Siddhartha
ఈ సినిమాకు ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయమవుతున్న సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాలో అంతా కొత్తవారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆ నలుగురు’ సినిమాతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్ ఈసారి థ్రిల్లర్ నేపథ్యంలో మిస్టరీ మ్యూజికల్ సినిమా తీశారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా చూపిస్తారట.
రోజూ రాత్రి సరిగ్గా 10.30 గంటలకు ఓ రేడియో స్టేషన్ నుండి ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ ఉంటారు. అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టారట. వారు ఆ పాటే ఎందుకు కోరుకుంటున్నారు. ఆ పాట ప్లే అయ్యే సమయంలో ఏం జరుగుతోంది అనేది సినిమా.
హర్ష హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, రేఖా నిరోష, ఇనయా సుల్తాన్ ప్రధాన పాత్రధారులు. 115 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఇంత చిన్న సినిమా రాలేదు.












