నాగచైతన్య-సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “లవ్ స్టోరీ”. పలు సామాజిక సమస్యలను వేలెత్తి చూపుతూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ప్రేమకథ మూడేళ్ళుగా మగ్గుతూ వచ్చింది. ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 24) విడుదలైంది. మరి శేఖర్ కమ్ముల మార్క్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందో లేదో చూడాలి.
కథ: తెలంగాణలోని ఆర్మూర్ గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి తమ కలలు నెరవేర్చుకోవడం కోసం పాట్లు పడుతుంటారు రేవంత్ (నాగచైతన్య), మౌనిక (సాయిపల్లవి). ఎంత ప్రయత్నించినా సాఫ్ట్వేర్ జాబ్ దొరక్కపోవడంతో.. రేవంత్ తో కలిసి డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం మొదలెడుతుంది మౌనిక. ఆ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు.
అక్కడే మొదలవుతుంది అసలు సమస్య.. దళిత క్రైస్తవుడైన రేవంత్, పటేల్ వంశీకురాలైన మౌనిక మధ్య ప్రేమను వాళ్ళ కుటుంబాలతోపాటు సమాజం కూడా అంగీకరించదు. ఈ కుల వివక్షతోపాటు కుటుంబ పరంగానూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను రేవంత్-మౌనిక ఎలా ఎదిరించారు? చివరికి వారి ప్రేమ ఫలించిందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవ్ స్టోరీ”.
నటీనటుల పనితీరు: ఒక కొత్త నాగచైతన్యను చూస్తాం సినిమాలో. తెలంగాణ పోరగాడిలా ఒదిగిపోయాడు చైతూ. వాచకం విషయంలో తాను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రతి పలుకులో వినిపిస్తుంది. రేవంత్ పాత్రను ఎవరైనా పోషించి ఉండొచ్చు.. కానీ ఆ పాత్రకు ఒద్దికను మాత్రం కేవలం చైతూ మాత్రమే అద్దగలడు. చైతన్య కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ గా మాత్రమే కాదు, అతని కెరీర్ లో ఓ కలికితురాయిగా ఈ పాత్ర/సినిమా మిగిలిపోతాయి. నిజానికి దళిత క్రైస్తవుడిగా నటించడం ఒక సాహసమే. చాలా తక్కువ మంది హీరోలు ఈ పాత్రలు చేయడానికి ముందుకొస్తారు.
మౌనిక పాత్ర పుట్టిందే సాయిపల్లవి కోసం అన్నట్లుగా ఉంటుంది. ఆధునిక యువతిగా, మనసు లోతుల్లో కూరుకుపోయిన చీకటి పొరలతో పోరాడే పడతిగా అద్భుతంగా నటించింది సాయిపల్లవి. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన, హావభావాలు కంటతడి పెట్టిస్తాయి. నటిగా ఆమె ప్రతి సినిమాతో ఎదుగుతుంది. రాజీవ్ కనకాల ఈ చిత్రంలో చాలా డేరింగ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అప్పట్లో తణికెళ్లభరణి ఈ తరహా పాత్రల్లో కనిపించేవాడు.
ఇప్పుడు రాజీవ్ ఈ లోటును తీరుస్తున్నాడు. రాజీవ్ క్యారెక్టర్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది. నాగచైతన్య తల్లి పాత్రలో ఈశ్వరి రావు మరోసారి గుర్తిండిపోయే స్థాయిలో నటన కనబరిచింది. ఈశ్వరి నటన మన అమ్మలను గుర్తుచేయడం ఖాయం. దేవయాని, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ లు చక్కని నటన కనబరిచి, పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా సంగీత దర్శకుడు పవన్ గురించి చెప్పుకోవాలి. తెలుగు సినిమాకి దొరికిన అనిరుద్ లాంటోడు పవన్. మనోడి పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నేపధ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంది. సినిమాలోని ఎమోషన్స్ మనసుకి హత్తుకునేలా చేయడంలో పవన్ పాత్ర చాలా కీలకం. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ కొడుకు పవన్. సో, తండ్రి విజువల్స్ కి తనయుడి నేపధ్య సంగీతం తోడై అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది.
విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది. సాంగ్స్ ను హైదరాబాద్ రియలిస్టిక్ లొకేషన్స్ లో షూట్ చేసిన విధానం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. శేఖర్ కమ్ముల ఎప్పట్లానే అందరి నటీనటుల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో 100% సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్క నటుడిని/నటిని సరికొత్తగా ప్రెజంట్ చేసాడు. చాలా మంది ఫిలిం మేకర్స్ టచ్ చేయడానికి వెనుకంజ వేసే అంశాలను కథాంశంగా తీసుకున్నాడు శేఖర్ కమ్ముల.
అయితే.. ఆ అంశాలను వివరించిన విధానం ఇంకాస్త బోల్డ్ గా తీసి ఉంటే బాగుండేది. ముగింపు మరీ కంగారుగా కానిచ్చేశారు. అందువల్ల క్లైమాక్స్ మాత్రం కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. డైలాగ్స్ మాత్రం కొన్నాళ్లపాటు గుర్తిండిపోతాయి.
విశ్లేషణ: శేఖర్ కమ్ముల మార్క్ సినిమాలను కోరుకునే ఆడియన్స్ ను విశేషంగా అలరించే చిత్రం “లవ్ స్టోరీ”. చివరి 15 నిమిషాల్లో చూపించిన కొన్ని బోల్డ్ ఇన్సిడెంట్స్ ను ఇంకాస్త క్లియర్ గా జస్టిఫై చేసి ఉంటే బాగుండేది. అలాగే.. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఈ కొద్దిపాటి మైనస్ పాయింట్స్ తప్పితే, “లవ్ స్టోరీ” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. సోలో రిలీజ్, ఎలాగూ వచ్చేవారం పెద్ద సినిమాలేవీ లేవు.
నాగచైతన్య, సాయిపల్లవిల ఫ్రెష్ పెయిరింగ్, శేఖర్ కమ్ముల ట్రీట్మెంట్ అన్నీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ బేరీజు వేసుకుంటే “లవ్ స్టోరీ” సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్: 3/5