2014లో విడుదలైన “అలా ఎలా” చిత్రంతో డీసెంట్ హిట్ అందుకొని దర్శకుడిగా అందరినీ ఆశ్చర్యపరిచిన అనీష్ కృష్ణ దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం దర్శకత్వం వహించిన చిత్రం “లవర్”. రాజ్ తరుణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడం విశేషం. కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రాజ్ తరుణ్ తేరుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!
కథ : అనంతపూర్ జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంలో ఏకైక బెస్ట్ బైక్ మోడిఫైయింగ్ మెకానిక్ రాజ్ (రాజ్ తరుణ్). డబ్బు సంపాదించి బ్యాంకాక్ వెల్లడమే ధ్యేయంగా బ్రతుకుతుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో.. అన్నయ్య (రాజీవ్ కనకాల) వదిన, అన్నయ్య కూతురు తన కుటుంబంగా భావిస్తుంటాడు. సరిగ్గా బ్యాంకాక్ వెళ్లడానికి సిద్ధమవుతున్న రాజ్ అనుకోని విధంగా హాస్పిటల్ లో చేరడంతో ఆ డ్రీమ్ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది.
అదే హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తున్న చరిత (రిద్ధికుమార్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు రాజ్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలయ్యాక.. ఉన్నట్లుండి చరితపై కొందరు రౌడీలు దాడి చేస్తారు. ఆ తర్వాత కొందరు రౌడీలు ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అసలు ఆ రౌడీ గ్యాంగ్ చరితను ఎందుకు వెబడిస్తుంటారు? రాజ్ తాను ప్రేమించిన చరితను ఆ గ్యాంగ్ బారి నుంచి ఎలా కాపాడుకొంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవర్” చిత్రం.
నటీనటుల పనితీరు : రాజ్ తరుణ్ ఓ పిలకతో కాస్త కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఇక చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ.. మాండలీకం, యాస మీద సరైన పట్టు లేకుండా ఏదో మాట్లాడాలని ప్రయత్నించడంతో అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. రాజ్ తరుణ్ అర్జెంట్ గా తన డైలాగ్ మాడ్యులేషన్ ను మార్చుకోకపోతే.. జనాలకి బోర్ కొట్టేసి అతడి సినిమాలు పట్టించుకోవడం మానేసే లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఇక రిద్ధికుమార్ వయసు చిన్నడవ్వడం వల్లనో ఏమో కానీ మరీ చిన్నపిల్లలా కనిపించింది. కళ్ళతో అభినయించగలదని అనిపించినప్పటికీ.. పెద్దగా ప్రతిభ చూపలేకపోయింది. రాజీవ్ కనకాలకి ఈ సినిమాలో మంచి రోల్ వచ్చింది కానీ.. ఆయన క్యారెక్టర్ ను డైరెక్టర్ ఏదో సీరియస్ గా చూపించాలనుకొన్నాడో ఏమో కానీ ఆయన సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా నవ్వకుండా నటించాడు. అజయ్, శరత్ కేల్కర్, సుబ్బరాజులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : అయిదుగురు సంగీత దర్శకులు కలిసి ఈ చిత్రానికి ఇచ్చిన బాణీల్లో సాయికార్తీక్ స్వరపరిచిన “నాలో చిలిపి కల” ఒక్కటే కాస్త ఆకట్టుకొంది. అయితే.. వినడానికి బాగున్నంతగా చూడ్డానికి లేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కారణంగా దిల్ రాజు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడలేదని అర్ధమయ్యింది. రాజ్ తరుణ్ మార్కెట్ కు మించి ఈ సినిమా కోసం వెచ్చించాడు దిల్ రాజు. సినిమా చాలా లావిష్ గా ఉంటుంది.
ఎడిటర్ ప్రవీణ్ పూడికి దర్శకుడు చెప్పిన పాయింట్ అర్ధం కాలేదో లేక ఎక్కువమంది చేతులు పెట్టడం వల్ల క్లారిటీ కోల్పోయాడో తెలియదు కానీ.. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది.
దర్శకుడు అనీష్ కృష్ణ “అలా ఎలా” తర్వాత 4 ఏళ్ళు “లవర్” కథ కోసం ఎందుకు వెయిట్ చేశాడు అనేది “వై కట్టప్ప కిల్డ్ బాహుబలి” కంటే పెద్ద క్వశ్చన్ గా మిగిలిపోతుంది. అలా ఉంది “లవర్” కథ-కథనం. ఇలాంటి కథ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కథ-కథనాలు పక్కన పెట్టేస్తే.. కనీసం డీలింగ్ లో కూడా కొత్తదనం ఎక్కడా కనిపించదు. చాలా సాదాసీదాగా కమర్షియల్ ఫార్ములాతో సినిమా సాగిపోయింది. “అలా ఎలా”తో ఆశ్చర్యపరిచిన అనీష్ కృష్ణ రెండో సినిమా అయిన “లవర్’తో మాత్రం నిరాశపరిచాడు.
విశ్లేషణ : అసలే వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న రాజ్ తరుణ్ కి “లవర్” ఏరకంగానూ ఉపయోగపడలేదు. ఇక అనీష్ కృష్ణ కూడా డైరెక్టర్ గా ఫెయిల్ అవ్వడంతో “లవర్” మరో వారాంతపు చిత్రంగా మిగిలిపోయింది. ఎంటర్ టైన్మెంట్ అనేది ఎక్స్ పెక్ట్ చేయకుండా థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకులు మాత్రమే చూడదగ్గ చిత్రం “లవర్”.
రేటింగ్ : 1.5/5