లక్కున్నోడు

  • January 27, 2017 / 05:51 AM IST

మంచు విష్ణు కథానాయకుడిగా “గీతాంజలి” ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లక్కున్నోడు”. విష్ణు సరసన హన్సిక కథానాయికగా నటించిన ఈ చిత్రం నిజానికి ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా.. సూర్య “ఎస్ 3” ఉన్నట్లుండి పోస్ట్ పోన్ అవ్వడంతో.. మరో ఆలోచన లేకుండా దొరికిన గ్యాప్ లో దూరిపోయాడు మంచు విష్ణు. మరి హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించామంటూ చెప్పుకోస్తున్న దర్శకనిర్మాతలు “లక్కున్నోడు” చిత్రంతో ప్రేక్షకులను ఏమేరకు అలరించారో చూద్దాం..!!

కథ : లక్కీ (మంచు విష్ణు) పేరులో ఉన్న లక్కు లైఫ్ లో లేక నానా కష్టాలు పడుతుంటాడు. తన దురదృష్టం కారణంగా కనీసం కన్నతండ్రి చేత పేరు పెట్టి పిలిపించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంటాడు. అలాంటి దురదృష్టవంతుడికి ఒక మాఫియా డాన్ కు “రైట్ హ్యాండ్” లాంటి వ్యక్తి వచ్చి.. పాతిక కోట్ల రూపాయల క్యాష్ ఇస్తాడు. ఆ క్యాష్ ను రెండ్రోజులు దాచి పెడితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతాడు. అసలు లక్కీకి ఆ వ్యక్తి 25 కోట్ల రూపాయల క్యాష్ ఎందుకు ఇచ్చాడు, ఉన్నట్లుండి దొరికిన పాతిక కోట్ల రూపాయల కొత్త 2000 నోట్లతో లక్కీ ఏం చేశాడు? అనేది “లక్కున్నోడు” కథాంశం.

నటీనటుల పనితీరు : మంచు విష్ణు తన కెరీర్ మొదలుపెట్టిన “విష్ణు” సినిమా నుంచి నటుడిగా నేర్చుకోంటూనే ఉన్నాడు. ఆఖరికి ఈ 19వ సినిమాలో విష్ణు నటన చూశాక కూడా “విష్ణు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది” అనిపించకమానదు. ఇక బాబుగారి డైలాగ్ డెలివరీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హన్సిక ఈ చిత్రంలో “ఏదో ఒకటి నటించేస్తే అయిపోతుందిలే” అన్నట్లుగా ఉన్న సన్నివేశాల్లో కనిపించానా, వినిపించానా అన్నట్లుగా ఆలావచ్చి, ఇలా వెళ్లిపోవడమే కాక “పాజిటివ్.. పాజిటివ్” అని పదే పదే రిపీట్ డైలాగ్ చెప్పి విసుగు తెప్పించింది. సాఫ్ట్ వేర్ బాస్ గా వెన్నెల కిషోర్, మంచి దొంగగా ప్రభాస్ శ్రీను, లక్కీ కారణంగా నష్టపోయిన ఫ్రెండ్ గా సత్యం రాజేష్ లు ప్రాసల పంచ్ లతో నవ్వించాలని ఎంత ప్రయత్నించినా.. సన్నివేశంలో కానీ.. కథలో కానీ కంటెంట్ లేకపోవడంతో.. వారి ప్రయత్నాలన్నీ దారుణంగా విఫలమయ్యాయి.

అన్నిటికంటే ముఖ్యంగా.. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ తన నట తృష్ణ తీర్చుకోవడం పోషించిన “విలన్” రోల్ కి డబ్బింగ్ సింక్ అయ్యింది కానీ.. ఆయన ఎక్స్ ప్రెషన్ మాత్రం అస్సలు సింక్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు : అద్నాన్ సమీ పాడిన “వాట్ ది ఎఫ్” అనే పాట మినహా ఏ ఒక్క గీతం గుర్తుంచుకొనే స్థాయిలో అనే విషయం పక్కన పెడితే.. కనీసం వినసోంపుగా కూడా ఒక్కటంటే ఒక్క పాట కూడా లేకపోవడం, ఉన్న పాటల కొరియోగ్రఫీ ఉన్న కాస్త సహనాన్ని కూడా పాడుచేసే విధంగా ఉండడంతో.. చాలామంది థియేటర్ల నుంచి బయటకు కూడా కదలలేక.. పాటలొచ్చినప్పుడల్లా ఫోన్ లలో ఫేస్ బుక్, వాట్సాప్ లు చూస్తూ గడిపేశారు. టైటిల్ సాంగ్ లో మోహన్ బాబు వేసే స్పెషల్ స్టెప్ ఒక్కటే కాస్తో కూస్తో అలరించింది. ఇక పి.జీ.విందా సినిమాటోగ్రఫీ ఒక్కటి తప్ప సినిమా మొత్తానికి మెచ్చుకోదగ్గ టెక్నికల్ క్వాలిటీ ఒక్కటి కూడా లేదు. ప్రొడక్షన్ వేల్యూస్, ఎడిటింగ్, ఫైట్స్ కంపోజింగ్ వంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలే కథలో విషయం లేక, కథనంలో పట్టు లేక సినిమా చూస్తున్న ప్రేక్షకులు నానా ఇబ్బందులు పడుతుంటే.. డైమండ్ రత్నబాబు తన విజ్ణానాన్నంతా రంగరించి రాసిన ప్రాసలతో, స్క్రీన్ ప్లేతో దాదాపు పిచ్చెక్కించినంత పనిచేశాడు.

“గీతాంజలి”తో హిట్ కొట్టినా ఆ క్రెడిట్ మొత్తం కోన వెంకట్ ఖాతాలోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన “త్రిపుర”ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల “లక్కున్నోడు”తో దర్శకుడిగా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసిన రాజ్ కిరణ్, రెండోసారి కూడా దారుణంగా విఫలమయ్యాడు. కథలో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ పై ప్రెజంట్ చేయలేకపోయాడు.

విశ్లేషణ : సినిమాలో నటిస్తున్న హీరో కథ ప్రకారం “లక్కున్నోడే”. కానీ.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడే దురదృష్టవంతుడు. కథలో వచ్చే అనవసరమైన ట్విస్టులను ఎంజాయ్ చేయలేక, పులిసిపోయిన ప్రాసల ప్రహసనాన్ని భరించలేక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు పడే కష్టాలు అన్నీ-ఇన్నీ కావు.

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus