మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. తన కార్యవర్గ సభ్యులతో నిరంతరం కళాకారుల బాగోగులు చూసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సేవే లక్ష్యంగా రంగంలోకి దిగిన రాజేంద్రప్రసాద్ టీమ్ పేద కళాకారులను ఆదుకునేందుకు గట్టి చర్యలు చేపట్టింది. ఏడాది కాలంలో ఒకప్పటి అధ్యక్షుడు చేయలేని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇవ్వడం, హెల్త్ ఇన్సూరెన్స్, టాలెండ్ ఉండి ఖాళీగా ఉన్న కళాకారులకు సినిమాలో వేషాలు ఇప్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ వెల్ఫేర్ చైర్మన్‌గా నియమించబడిన తర్వాత ఓ సర్వే నిర్వహించారు. పలు వర్క్‌షాపులు ఏర్పాటు చేశారు. 700కు పైగా సభ్యులున్న అసోసియేషన్‌లో సర్వే నిర్వహించి వారి అవసరాలను తెలుసుకున్నారు.
30 కుటుంబాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయనీ, ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా తక్కువ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లడానికి 10 కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయనీ, ఎప్పటికైనా సాయాన్ని అర్ధించే వారు 40 మంది ఉన్నారనీ సర్వేలో తెలింది.
హెల్త్ కేర్, హెల్త్ కార్డ్స్, హౌసింగ్, రోజు గడవడం కోసం పని అడిగేవారు కొందరు ఉండడంతో ఒక దాని తర్వాత ఒకటి అమలు చేసే దారిలో మా అసోసియేషన్ పయనిస్తుంది. వ్యాపారం చేసుకొని జీవితం సాగిస్తామని లోన్ అడిగిన వారికి ఓ బ్యాంక్‌తో టైయప్ అయ్యి రుణాలు ఇప్పించేందుకు కూడా ‘మా’ సిద్ధపడింది. సర్వే ఆధారంగా 30 మందికి ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అసోసియేషన్ ఆమోదించింది.
30 మందికి రూ.1000 పెన్షన్ ఇస్తాననీ చెప్పిన ‘మా’ వెయ్యి కాదు రూ. 2000 ఇచ్చి కళాకారులను ఆదుకుంది.
‘మా’ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో అందరికీ తెలుసు. చూసినవాళ్లంతా ఈ రెండు టీమ్‌లు కలిసి పని చేయలేవు అనుకున్నారు. అలా అనుకున్న వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది మా అసోసియేషన్. రాజేంద్రప్రసాద్ టీమ్, జయసుధ టీమ్ ఇప్పుడు కలిసిమెలసి పనిచేస్తు అసోసియేషన్ అభివృద్దికి ప్రతిక్షణం కష్టపడుతున్నారు. ‘సేవే మా లక్ష్యం’ అన్న నినాదంతో ఓ యజ్ఞంలాగా ముందుకెళ్తున్న అసోసియేషన్‌లో సెక్రటరీగా శివాజీరాజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.