స్టార్స్ వారసులంతా స్టార్స్ అవుతారన్న గ్యారెంటీ లేదు. వాళ్ళకి ఎంట్రీ మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. ఇంకా డిటైల్డ్ గా చెప్పాలంటే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే.. చాలా ఈజీ అంతే. కానీ స్టార్ గా ఎదగాలి అంటే.. అతని బ్యాక్ గ్రౌండ్ సరిపోదు. తపన ఉండాలి. ఆడియన్స్ ఓన్ చేసుకోవాలి. వాళ్ళని మెప్పించిన వాళ్ళే స్టార్స్ అయ్యారు. ఈ రియాలిటీని అర్థం చేసుకునే శోభన్ బాబు వంటి స్టార్స్ తమ కొడుకులను సినిమాల్లోకి రావాలని ఒత్తిడి చేయలేదు. సూపర్ స్టార్ కృష్ణ మాత్రం తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని హీరోగా నిలబెట్టాలి అనుకున్నారు. హీరోగా రమేష్ బాబు పలు సినిమాల్లో నటించడం జరిగింది. కానీ హీరోగా రమేష్ ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు.
ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేశారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ తో మహేష్ బాబుని లాంచ్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. తొలి సినిమాతోనే మహేష్ హీరోగా మంచి మార్కులు వేయించుకున్నారు.
కానీ ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘యువరాజు’ ‘వంశీ’ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘మురారి’ నటుడిగా మహేష్ కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా. కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
మళ్ళీ ఆ సినిమా తర్వాత మహేష్ కి ‘టక్కరి దొంగ’ ‘బాబీ’ వంటి ప్లాపులు పలకరించాయి. మరోపక్క ఉదయ్ కిరణ్, తరుణ్, జూ.ఎన్టీఆర్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతున్న సమయం అది. సరిగ్గా అలాంటి టైంలో ‘ఒక్కడు’ తో తన సత్తా చాటాడు మహేష్ బాబు. ఈ సినిమా మాస్ కి సరికొత్త డెఫినిషన్ చెప్పింది. మహేష్ కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అతన్ని స్టార్ గా నిలబెట్టింది. దీని తర్వాత చేసిన ‘నిజం’ ‘నాని’ ‘అర్జున్’ వంటి సినిమాలు రాంగ్ ఛాయిస్ గా మిగిలిపోయాయి.
మార్కెట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మహేష్ సినిమాలు చేయకపోవడంతో అభిమానుల్లో ఒకింత కలవరం ఏర్పడింది. ఈ క్రమంలో వచ్చిన ‘అతడు’ పై మొదట్లో అంచనాలు లేవు. కానీ మంచి ఫలితాన్ని ఇచ్చింది. మహేష్ కూడా అతని తండ్రి కృష్ణ మాదిరి డేరింగ్ అండ్ డాషింగ్ అని ప్రూవ్ చేసింది. ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ కు తిరుగులేని స్టార్ డంని తెచ్చిపెట్టింది.
అటు తర్వాత మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతని మార్కెట్ పెరిగింది. ‘సైనికుడు’ ‘అతిథి’ ‘ఖలేజా’ వంటి సినిమాలు నిరాశపరిచినా.. ‘దూకుడు’ ‘బిజినెస్ మెన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్లతో తన రేంజ్ పెంచుకున్నాడు. అలాగే ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సందేశాత్మక సినిమాలు తీసి సూపర్ స్టార్ గా తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు మహేష్ బాబు.
సక్సెస్ ఫుల్ మూవీస్ తీసినందుకు కాదు.. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను మహేష్ కు లాయల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దాదాపు 4000 మంది చిన్న పిల్లలకు ఆంధ్ర హాస్పిటల్స్ వారితో కలిసి హార్ట్ సర్జరీలు చేయించి వారికి ప్రాణదానం చేశాడు. అలాగే బుర్రిపాలెం, సిద్దాపురం వంటి 2 గ్రామాలను దత్తత తీసుకుని.. ఇప్పటికీ తన సేవలు అందిస్తున్నాడు.
ఈ ఆగస్టు 9తో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న మహేష్ 4 ఏళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టి.. 44 ఏళ్లుగా సినిమాల్లోనే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ గోల్డెన్ జూబ్లీ మహేష్ కు మరింత స్పెషల్ గా ఉండాలని ఆశిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే టు మహేష్ బాబు’.