Mahesh Babu: 45 ఏళ్ళ సినీ ప్రస్థానంలో మహేష్ బాబు ఎదుర్కొన్న విమర్శలు,విషాదాలు, విజయాలు..!

  • November 29, 2024 / 08:41 PM IST

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) గారి తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు నేటితో నటుడిగా 45 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్నాడు. అతని మొదటి సినిమా ‘నీడ’ 1979 నవంబర్ 29న విడుదలైంది.దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ కిడ్ అయినప్పటికీ మహేష్ బాబు (Mahesh Babu)  కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు. తన తండ్రిలా సూపర్ స్టార్ అవ్వాలనే తపన అతన్ని ఈరోజు నెంబర్ వన్ హీరోగా నిలబెట్టింది అని చెప్పాలి.

Mahesh Babu

వాస్తవానికి మహేష్ బాబుని హీరోని చేయాలనే ఆలోచన మొదట సూపర్ స్టార్ కృష్ణ గారికి లేదు. రమేష్ బాబుని హీరోగా నిలబెట్టిన తర్వాత ఆలోచిద్దాం అని అనుకున్నారు. కానీ రమేష్ బాబుని హీరోగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని సినిమాలు చేశాడు. అవి ఆడలేదు. సూపర్ స్టార్ కేమియోలు చేసినా.. అవి రమేష్ బాబు  (Ramesh Babu) కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. దీంతో మహేష్ బాబుని హీరోగా బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు.

మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసే బాధ్యత మొదట కృష్ణవంశీకి వచ్చింది. కానీ కథ సెట్ అవ్వకపోవడం.. కృష్ణవంశీ (Krishna Vamsi) దాన్ని బరువుగా ఫీలయ్యి ఎక్కువ టైం అడగడంతో రాఘవేంద్రరావుని సీన్లోకి దింపారు కృష్ణ. అలా ‘రాజకుమారుడు’ (Rajakumarudu) తెరకెక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా, ఎక్కువ కేంద్రాల్లో వంద రోజులు ఆడిన హీరోగా మహేష్ బాబు తొలి చిత్రంతోనే రికార్డులు నెలకొల్పాడు.

అయితే డెబ్యూ వర్కౌట్ అయినా.. తర్వాత మహేష్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాలేదు. ‘యువరాజు’ (Yuvaraju) పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత దర్శకుడు సముద్రతో అనుకున్న సినిమా ఆగిపోయింది. దీంతో హడావిడిగా దర్శకుడు బి.గోపాల్ (B. Gopal) తో ‘వంశీ’ (Vamsi) చేయించారు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా వల్ల మహేష్ కి నమ్రతకి (Namrata Shirodkar) పరిచయం ఏర్పడటం.. తర్వాత అది ప్రేమగా మారి 2005 లో పెళ్ళి చేసుకునే వరకు వెళ్లడం జరిగింది.

మహేష్ బాబుకి మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది, నటుడిగా నిలబెట్టింది ‘మురారి’ (Murari) అనే చెప్పాలి. అప్పుడప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న మహేష్ బాబు కెరీర్ కి.. మంచి బూస్టప్ ఇచ్చింది ఈ సినిమా. చాలామంది సీనియర్స్ తో మహేష్ ఎక్కడా తగ్గకుండా నటించి మెప్పించాడు.అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రీ- రిలీజ్..లో కూడా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబుని ప్లాపులు వెంటాడాయి. ఎంతో కష్టపడి చేసిన ‘టక్కరి దొంగ’ (Takkari Donga) ప్లాప్ అయ్యింది. ‘బాబీ’ (Bobby) సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ (Uday Kiran) , ఎన్టీఆర్ (Jr NTR) , తరుణ్ (Tarun Kumar) వంటి వాళ్ళు స్టార్ ఇమేజ్ తెచ్చుకుని దూసుకుపోతుంటే మహేష్ బాబు వెనుకబడిపోయాడు అనే విమర్శలు ఆ టైంలో వచ్చాయి. అలాంటి టైంలో వచ్చిన ‘ఒక్కడు’ (Okkadu) పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి.. మహేష్ బాబుకి కమర్షియల్ ఇమేజ్ ఏర్పడేలా చేసింది.

‘ఒక్కడు’ తో వచ్చిన కమర్షియల్ ఇమేజ్ ను మళ్ళీ పక్కన పెట్టి ‘నిజం’ (Nijam) ‘నాని’ (Nani) వంటి ప్రయోగాత్మక సినిమాలు చేశాడు మహేష్. అవి నిరాశపరిచాయి. ఆ తర్వాత చేసిన ‘అర్జున్’ (Arjun) కూడా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. అప్పుడు కూడా మహేష్ బాబుపై విమర్శలు వచ్చాయి. అలాంటి టైంలో త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ‘అతడు’ (Athadu) చేసి కోలుకున్నాడు.

‘అతడు’ సినిమా మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యేలా చేసింది. అంతేకాదు ఓవర్సీస్లో కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది అని చెప్పాలి. ఇప్పటికీ ‘అతడు’ రిపీటెడ్ గా చూసేలా ఉంటుంది. చాలా మందికి ఇది హాట్ ఫేవరెట్ మూవీ. దీనిని రీ రిలీజ్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.

ఇక ‘అతడు’ తర్వాత వచ్చిన ‘పోకిరి’ (Pokiri) మహేష్ బాబుని సూపర్ స్టార్ గా నిలబెట్టింది. అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ‘పోకిరి’ తో మహేష్ బాబు మార్కెట్ 3 రెట్లు పెరిగింది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాకి దర్శకుడు. వేరే భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

‘పోకిరి’ తర్వాత 5 ఏళ్ళ పాటు మహేష్ కి హిట్టు లేదు. ‘సైనికుడు’ (Sainikudu) ‘అతిథి’ (Athidhi) సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. తర్వాత కెరీర్లో 3 ఏళ్ళు గ్యాప్ కూడా వచ్చింది. 2008,2009 ..ల టైంలో మహేష్ బాబు నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.

‘అతడు’ కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా’ (Khaleja) కూడా మహేష్ బాబు సక్సెస్ ను ఇవ్వలేదు. కానీ తర్వాత టీవీల్లో చూశాక ‘ఇది సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అన్నారు’. ఒకవేళ రీ రిలీజ్లో అయితే బాగా చూస్తారేమో..!

‘పోకిరి’ తర్వాత మహేష్ బాబుకి మంచి బ్లాక్ బస్టర్ అందించిన సినిమా ‘దూకుడు’ (Dookudu). శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాన్- రాజమౌళి (S. S. Rajamouli) ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘మగధీర’ (Magadheera) తర్వాత వంద కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ఇందులో మహేష్ బాబు నటన అద్భుతం.

ఆ తర్వాత వచ్చిన ‘బిజినెస్ మెన్’ (Businessman) కూడా సూపర్ హిట్ అయ్యింది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాలో వెంకటేష్ తో (Venkatesh) కలిసి నటించి మల్టీస్టారర్ ట్రెండ్ కి పూర్వ వైభవాన్ని తెచ్చాడు మహేష్ బాబు. శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) లాంటి మల్టీస్టారర్ వచ్చింది అంటే దానికి పునాది వేసింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చెప్పాలి.

ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) ‘మహర్షి’ (Maharshi) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) వంటి హిట్లు మహేష్ ఖాతాలో పడ్డాయి.

2022 అయితే మహేష్ బాబుకి బ్లాక్ – ఇయర్ అని చెప్పాలి. ఆ ఏడాది అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ..లను పోగొట్టుకున్నాడు మహేష్ బాబు. దాని నుండి కోలుకోవడానికి చాలా టైం పట్టింది.

ఈ ఏడాది అంటే 2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు. అది సో సో గానే ఆడింది. అయితే మహేష్ బాబు పెర్ఫార్మన్స్ మాత్రం ది బెస్ట్ అనే విధంగా ఉంటుంది.

ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. ఇదొక మైథలాజికల్ కమ్ అడ్వెంచరస్ డ్రామా. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.

45 ఏళ్ళ సినీ కెరీర్లో 8 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు మహేష్ బాబు.

రెండు ఊర్లను దత్తత తీసుకోవడం, ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు వంటివి చేయించడం.. వంటి సేవా కార్యక్రమాలతో నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు మహేష్ బాబు.

OTTలో సమంతను కొట్టేవారే లేరు.. నెంబర్ వన్ రెమ్యునరేషన్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus