టాలీవుడ్ లోని విలక్షమైన నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అటు సీరియస్ గా ఉంటూనే నవ్వులు పూయించగలరు. అతడు సినిమాలో బుజ్జిగా అలరించారు. ఆ చిత్రంలో మహేష్ బ్రహ్మాజీతో ఫైట్ చేసే సీన్ థియేటర్ ని నవ్వులతో నింపింది. దూకుడులో అయితే ఇద్దరూ కలిసి బ్రహ్మానందాన్ని ఆడుకునే సన్నివేశాలు బాగా నవ్వించాయి. బిజినెస్ మ్యాన్ సినిమాలోనూ వీరి కాంబినేషన్ ఆకట్టుకుంది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన “భరత్ అనే నేను” చిత్రంలో బ్రహ్మాజీ సీఎం భరత్‌కు పీఎస్(పర్సనల్ సెక్రటరీ) భాస్కర్ పాత్రలో కామెడీ పండించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ పాత్రకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 125 కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతోంది. అందుకే తన సినిమాలో బ్రహ్మజీ ఉంటే తనకు కలిసొస్తుందని మహేశ్ అన్నారు.
హైదరాబాద్‌లో మొన్న “భరత్ అనే నేను” విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేదికపై బ్రహ్మాజీపై మహేష్ అభినందనలు కురిపించారు. “నేను, బ్రహ్మాజీ నటించిన సినిమాలు 99 శాతం విజయం సాధించాయి. నాకు ఇష్టమైన నటుల్లో బ్రహ్మజీ ఒకరు.” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొరటాల శివ కూడా బ్రహ్మజీ గురించి మాట్లాడారు. “అతను అరుదైన నటుడు. ఏ సన్నివేశంలోనైనా హాస్యాన్ని, భావోద్వేగాన్ని పండించగలరు. అతను నేచురల్ యాక్టర్. ‘భరత్ అనే నేను’లో తొలి సగ భాగం సినిమా మొత్తం బ్రహ్మాజీదే.” అని వివరించారు. వీరి మాటలే తనకు అవార్డులతో సమానమని బ్రహ్మజీ ఆనందపడుతున్నారు.