తెలుగు తెరపై మలయాళ కుట్టీల హవా

గాడ్స్ ఓన్ కంట్రీ గా పేరుగాంచిన కేరళ భామలపై మనవాళ్లు అభిమానం పెంచుకుంటున్నారు. మలయాళీ సినిమాలో నటించే తారలను తెలుగు సినిమాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇదివరకు శోభన, అసిన్ , నయన తార, మమతా మోహన్ దాస్ వంటి ఎందరో టాలీవుడ్ లో ప్రవేశించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మలయాళ కుట్టీలు కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, మడోన్నా, సాయి పల్లవి తదితరులు తెలుగు సినిమాల్లో దూసుకుపోతున్నారు.

కీర్తి సురేష్

మల్లూవుడ్ లో కీర్తి సురేష్ ఐదు సినిమాలో నటించింది. ఆమె “నేను శైలజ” అనే తెలుగు సినిమాలో రామ్ సరసన ఆడి పాడింది. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నఈ మలయాళీ భామకు వెంటనే అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. వరుసగా ఆరు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం మరో మలయాళం చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. ఈ బిజీ వల్ల పవన్ కళ్యాణ్ సినిమా లో నటించే అవకాశాన్ని కూడా కీర్తి సురేష్ వదిలేసుకుంది. అయినా తెలుగు నిర్మాతలు ఆమెను వదలలేదు. సినిమా చూపిస్తా మామ సినిమా డైరక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు.

అనుపమ పరమేశ్వరన్

మలయాళం ప్రేమమ్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చిన్న పాత్ర చేసింది. పాత్ర చిన్నదైనా పేరు బాగానే వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “అ ఆ” చిత్రంలో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. “రావణాసురుడి భార్య కూడా వాళ్ల ఆయనను పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది” .. అని ముద్దుగా మాట్లాడుతూ తెలుగు యువకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రేమమ్ రిమేక్ లో నటిస్తోంది. ఒరిజినల్ మూవీలో చేసిన పాత్రనే తెలుగులోనూ చేస్తోంది. యువ సామ్రాట్ నాగ చైతన్యతో ప్రేమను పండించనుంది.

నివేదా థామస్

మిళం, మలయాళ భాషల్లో దాదాపు పది సినిమాల్లో నటించిన కేరళ కుట్టీ నివేదా థామస్. కొంత ఆలస్యంగా తెలుగు తెరకు పరిచయమైనా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా వచ్చిన లేటెస్ట్ మూవీ జెంటిల్ మాన్ లో నివేదా చక్కగా నటించింది. తెలుగు చిత్ర నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్కిన్ షో కు దూరంగా కథాబలమున్న చిత్రాల్లో నటించేందుకు ఈ భామ ఆసక్తి చూపిస్తోంది.

మడోన్నా సెబాస్టియన్

తన తొలి చిత్రం “ప్రేమమ్(మలయాళం)” తోనే అందరిని ఆకర్షించిన భామ మడోన్నా సెబాస్టియన్. కేరళలో పుట్టి పెరిగిన ఈ సుందరి.. నటిగా మారక ముందు మంచి సింగర్. పలు టీవీ షోలలో విజేతగా నిలిచింది. కొంతకాలం యాంకరింగ్ కూడా చేసింది. ప్రేమమ్ చిత్రం ఆమె కెరీర్ ని మార్చింది. తెలుగు ప్రేమమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. మరో రెండు తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతోంది.

సాయి పల్లవి

తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మలయాళ నటి సాయి పల్లవి. ఈమె “ప్రేమమ్(మలయాళం)” సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈమె వరుణ్ తేజ్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న అమెరికా అబ్బాయి- తెలంగాణ అమ్మాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది.

మంజిమ మోహన్

ఐదేళ్ల వయసులోనే కెమెరా ముందు కొచ్చిన కేరళ అమ్మాయి మంజిమ మోహన్. ఈమె తండ్రి అప్పటికే మల్లూవుడ్ లో గొప్ప కెమెరా మెన్ కావడంతో ఆడుకునే వయసులోనే ఎనిమిది చిత్రాల్లో నటించింది. ఏడేళ్ల వయసులో మంజిమ ఉత్తమ బాల్య నటిగా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకుంది. తర్వాత చదువు పై ఏకాగ్రత పెట్టింది. స్టడీ పూర్తికాగానే గత ఏడాది  “ఒరు వదక్కాన్ సెల్ఫీ” అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రంలో మంజిమ నటన చూసి గౌతమ్ మీనన్ తన తమిళ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులోనూ అద్భుతంగా నటించడంతో గౌతమ్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సరసన ఈ కేరళ భామ “సాహసమే శ్వాసగా సాగిపో ” చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంజిమ మోహన్ తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus