టాలీవుడ్ లో మలయాళ ముద్దుగుమ్మల హవా!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మలయాళ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. తమ ప్రతిభతో భవిష్యత్తుకు చక్కటి బాటలు ఏర్పరచుకుంటున్నారు ఈ భామలు. వీరిలో ముందులో చెప్పుకోవాల్సింది నటి కీర్తి సురేష్ పేరే. నవీన్ విజయ్ కృష్ణతో ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమాలో నటించిన కీర్తికి ఆ సినిమా విడుదలకు ముందే రామ్ తో ‘నేను.. శైలజ’ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకొని దాన్ని సధ్వినియోగం చేసుకొంది. 2016 జనవరి 1 న ‘నేను.. శైలజ’ తో బోణీ కొట్టిన ఈ భామకు తెలుగులో మంచి అవకాశాలు మొదలుపెట్టాయి. చిత్ర నిర్మాతల దృష్టి కీర్తిపై పడింది. త్వరలోనే నానితో కలిసి ఓ చిత్రంలో నటించనుంది కీర్తి.

ఇవి కాకుండా.. మరో రెండు, మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటోంది అనుపమ పరమేశ్వరన్. నాగ చైతన్య ‘ప్రేమమ్’ సినిమా తెలుగు రీమేక్ లో కూడా అనుపమనే ఎన్నుకున్నారు. అయితే ఆ సినిమాకు ముందుగానే త్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమాలో మెరిసి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిందీ భామ. తెలుగులో ప్రేమమ్ తో పాటు శర్వానంద్ సరసన దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా కమిట్ అయింది అనుపమ. తెలుగు పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ ఓ వెలుగు వెలగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘జెంటిల్ మన్’ సినిమాలో నానికి పోటీగా నటించింది నివేద థామస్. ఆమె నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఈ సినిమాతో నివేదా డేట్స్ దొరకడం కష్టమైపోతుంది. ఎన్‌టి‌ఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. మరో హిట్టు గనుక పడితే నివేదా పేరు కూడా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయం. మలయాళ ప్రేమమ్ సినిమాలోనే నటించిన మరో భామ సాయి పల్లవి. తన పాత్ర మలార్ పేరుతోనే ఇప్పుడు అందరూ తనని పిలుస్తున్నారు. అంతగా ప్రేక్షకులను మాయ చేసింది. తెలుగు ప్రేమమ్ లో కూడా తననే తీసుకోవాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు. అయితేనేం శేఖర్ కమ్ముల లాంటి సాఫ్ట్ డైరెక్టర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి సినిమాకే మెగాహీరో వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మరి తెలుగులో ఈ భామ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో.. చూడాలి.

చైల్డ్ ఆర్టిస్స్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజిమా మోహన్ అతి త్వరలోనే గౌతమ్ మీనన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏ.ఆర్.రహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే తెలుగులో మంజిమాకు తిరుగుండదనే చెప్పాలి. తెలుగు చిత్రసీమలో ఇప్పుడిప్పుడే కథానాయికల కొరత తీరుతోంది. నవతరం నాయికల జోరు ఒకట్రెండు సినిమాలకే పరిమితం కాకుండా.. మరిన్ని విజయాలు అందుకుంటే దర్శక నిర్మాతలకు హీరోయిన్స్ కోసం వెతుక్కునే పని ఉండదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus