తెలుగులో బిజీ అవుతున్న మలయాళం స్టార్స్..!

Ad not loaded.

టాలీవుడ్‌లో (Tollywood) మాలీవుడ్ భామలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురల్ బ్యూటీలకు పేరుగాంచిన కేరళ తారలు తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ, వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే ఇప్పుడు మలయాళ సహా నటులు, హీరోలు కూడా టాలీవుడ్ వైపు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), పహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  వంటి స్టార్ నటులు తెలుగులో తమ సత్తా చాటుతుండగా, మరికొందరు నటులు కూడా త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Tollywood

దుల్కర్ సల్మాన్ తన మలయాళ ప్రాజెక్టులను తగ్గించి, తెలుగులో మరిన్ని ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటున్నాడు. ‘సీతారామం’ (Sita Ramam) విజయం తర్వాత, అతని మార్కెట్ తెలుగులో బాగా పెరిగింది. ఇప్పుడు దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే సినిమాతో రాబోతున్నాడు. మరోవైపు, పహాద్ ఫాజిల్ (Fahadh Faasil)  ‘పుష్ప’లో (Pushpa) భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో అలరించాడు. ఇప్పుడు అతను తన మలయాళ చిత్రాలను తెలుగులో విడుదల చేస్తూ, ఇక్కడ కూడా మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ (Salaar) లో ప్రభాస్ (Prabhas) స్నేహితుడిగా నటించి, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇదివరకు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్, ఇప్పుడు ‘సలార్ 2’, అలాగే ‘SSMB29’ లోనూ కీలక పాత్ర పోషించనున్నాడు. అతను డైరెక్ట్ చేసిన ‘L2: Empuraan’ కూడా తెలుగులో విడుదల కానుంది. మరోవైపు, ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ‘మార్కో’ (Marco) సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. అతని విలన్ గెటప్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ కూడా అతనిని విలన్‌గా వాడుకోవాలని ఆలోచిస్తున్నారు.

పాతతరం నుంచి మోహన్ లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mamootty), జయరామ్ (Jayaram) లాంటి సీనియర్ మాలీవుడ్ స్టార్‌లు తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ‘శాకుంతలం’ (Shaakuntalam) లో నటించిన దేవ్ మోహన్ (Dev Mohan), ‘సతీలీలావతి’ చిత్రంలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సరసన నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టివినో థామస్ (Tovino Thomas) ఇప్పుడు ఎన్టీఆర్ (Jr NTR) , ప్రశాంత్ నీల్  (Prashanth Neel) సినిమాలో నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే అతని కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ విధంగా, మలయాళ హీరోలు టాలీవుడ్‌లో తమ స్థానం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకుని, క్లాస్, మాస్ కు దగ్గరయ్యే సినిమాలను ఎంచుకుంటూ, పెద్ద హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్‌లో స్థిరపడుతున్నారు. ముందు ముందు మరింత మంది మలయాళ నటులు తెలుగు పరిశ్రమలో తమ టాలెంట్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus