చేనేత కార్మికుల కష్టాలు, వారి కుటుంబాల్లోని మహిళలను కొన్ని ఏళ్లపాటు ఇబ్బందులుపెట్టిన ఆశును చేత్తో నేయడం కోసం పడిన శ్రమ, చేసిన త్యాగాలు.. ఆ కష్టం నుంచి వారిని కాపాడడం కోసం చింతకిండి మల్లేశం అనే ఓ కార్మికుడు తయారు చేసిన ఆశు మెషీన్ వారి జీవితాలను ఎలా మార్చింది అనే నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం “మల్లేశం”. పూర్తిస్థాయి తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై స్పెషల్ షోల ద్వారా చూసినవాళ్ళందరూ ప్రశంసల వర్షం కురిపించారు. మరి సినిమా ఆ ప్రశంసల స్థాయిలో ఉందా లేదా అనేది చూద్దాం..!!
కథ: కుటుంబ పరిస్థితుల కారణంగా 7వ తరగతికే స్కూల్ మానేసి తల్లిదండ్రులకు తోడుగా ఇక్కత్ పని చేస్తూ.. స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు మల్లేశం (ప్రియదర్శి). ఈ క్రమంలో ఆశు నేయడం వల్ల తన తల్లి (ఝాన్సీ) భుజం ఎముకలు అరిగిపోయానని, అలాగే కంటిన్యూ చేస్తే ఆమె త్వరలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ చేసిన అప్పులు తీర్చాలన్నా. రోజుకి ఇంట్లో అందరూ అన్నం తినాలన్నా ఇక్కత్ పని చేయడం ఒక్కటే మార్గం కాబట్టి.. కష్టమైనా ఇష్టంతో అదే పని చేస్తుంటారు.
అయితే.. చిన్నప్పట్నుంచి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మల్లేశం.. తన తల్లి కష్టాన్ని తీర్చడం కోసం ఆశు నేసే మెషీన్ ను కనిపెట్టాలనుకొంటాడు. అందుకోసం ఊర్లో తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పు చేస్తాడు. ఏళ్ళు గడిచినా మెషీన్ మాత్రం పూర్తవ్వదు. ఈలోపు ఊర్లోవాళ్ళందరూ మల్లేశంను పిచ్చోడిలా ట్రీట్ చేయడం మొదలెడతారు.
ఎన్నో అవాంతరాలు, ఇంకెన్నో ఆర్ధిక ఇబ్బందులు, చెప్పుకోలేనన్ని సమస్యలను ఎదుర్కొని మల్లేశం ఆశు నేసే మెషీన్ ను ఎలా రూపొందించాడు? తన తల్లి కష్టాన్ని తీర్చడం కోసం మల్లేశం తయారు చేసిన మెషీన్ కొన్ని వందల కుటుంబాలకు ఎలా ఊరటనిచ్చింది? అనేది “మల్లేశం” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నిన్నటివరకూ హీరో ఫ్రెండ్ లేదా కామెడీ రోల్స్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించిన ప్రియదర్శిని ఒక్కసారిగా చాలా సైలెంట్ & సెటిల్డ్ రోల్లో చూడ్డానికి తొలుత కాస్త ఇబ్బందిపడినప్పటికీ.. సినిమా మొదలైన కొద్దిసేపటికే మనం చూస్తున్నది ప్రియదర్శిని కాదని, మల్లేశం అనే వ్యక్తి జీవితాన్ని అని గుర్తుచేస్తాడు దర్శకుడు. ఆ పెట్టుడు మీసం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది తప్పితే.. నటుడిగా ప్రియదర్శి లోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే చిత్రమిది. ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త ఎలివేటేడ్ గా యాక్ట్ చేస్తే బాగుడేదేమో అనిపిస్తుంటుంది.
ఒక చక్కని తెలంగాణ ఆడపడుచు పాత్రకు అనన్య న్యాయం చేసింది. ఆమె కట్టు, బొట్టు, వ్యవహారశైలి అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఏ సన్నివేశంలోనూ ఆమె నటించినట్లుగా కనిపించదు. మంచి భవిష్యత్ ఉన్న నటి అనన్య.
మల్లేశంగా నటించడానికి ప్రియదర్శి ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ.. అతడి తల్లిగా మాత్రం యాంకర్ కమ్ యాక్టర్ ఝాన్సీ సునాయాసంగా జీవించింది. ఆశు నేయడం మొదలుకొని.. కొడుక్కి మమతానురాగాలు పంచడం, కొడుకు పంపే మనీ ఆర్డర్ కోసం వేచి చూడడం ఇలా ప్రతి సన్నివేశంలో ఝాన్సీని చూస్తున్నప్పుడు మన పక్కింటి పెద్దమ్మ గుర్తొస్తుంది. ఆమె అద్భుతమైన నటి అని తెలిసిన విషయమే అయినప్పటికీ.. మల్లేశం ఆమె సహజమైన నటి అని ఇంకాస్త బలంగా చాటి చెప్పింది. సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే క్యాటగిరీలో అవార్డ్ ఇస్తే.. ఆ అవార్డ్ కచ్చితంగా ఝాన్సీ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే.
తాగుబోతు రమేష్ కామెడీ సీన్స్ బాగున్నాయి. మల్లేశం స్నేహితులుగా నటించిన నటులు కూడా ఆరోగ్యకరమైన హాస్యంతో ఆకట్టుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సినిమా టైమ్ లైన్ 1980 నుంచి తీసుకోవడం.. అది ప్రేక్షకుల మెదళ్ళలో బాగా రిజిష్టర్ అవ్వడం కోసం చిరంజీవి సినిమాలను ఎంచుకొన్న పద్ధతి బాగుంది. చిరంజీవి “అడవి దొంగ”తో మొదలయ్యే కథ.. 1992లో వచ్చిన “ఘరానా మొగుడు” దాకా సాగిన పద్ధతి ముచ్చటగా ఉంటుంది. దర్శకుడు ఒక గొప్ప వ్యక్తి కథను సినిమాగా మాలచాలి అనుకొన్న ఆలోచన, ఆ ఆలోచనను తనకు వీలైనంతలో ఆచరణలోకి పెట్టిన విధానం ప్రశంసనీయం.. కానీ ఒక సినిమాకి ఇన్స్పైరింగ్ కథ ఎంత ముఖ్యమో.. ఎమోషనల్ గా కనెక్ట్ చేసే కథనం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని దర్శకనిర్మాత రాజ్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనిపిస్తుంది.
“మల్లేశం” ఒక సినిమాలా కాక ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్ గా కనిపిస్తుంది. నటీనటుల పనితీరు, సాంకేతిక నిపుణుల పనితీరు బాగున్నప్పటికీ.. సినిమాటిక్ ఫీల్ మాత్రం రాదు. అలాగే.. సినిమాను ముగించిన విధానం కూడా అర్ధాంతరంగా ముగుసిపోయింది అనే భావన కలిగిస్తుంది తప్పితే ఒక సంతృప్తినివ్వదు. ఏదో అసంతృప్తి, ఏదో మిస్ అయ్యింది అనే భావన సినిమా చూసిన కొన్ని గంటల వరకు మెదడులో, మనసులో ఉండిపోతుంది. అది ఒక్కటి తప్పితే.. సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు.
విశ్లేషణ: ఒక వ్యక్తి కష్టాన్ని, తన వాళ్ళ కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం నిశ్వార్ధంతో సాగించిన ప్రయాణాన్ని అంతే నిజాయితీతో తెరకెక్కించిన చిత్రం “మల్లేశం”. సినిమాటిక్ ఎమోషన్స్ & ఎక్స్ పీరియన్స్ ను కోరుకొనేవాళ్ళకి మినహా అందరికీ నచ్చే సినిమా ఇది.
రేటింగ్: 2/5
CLICK HERE TO READ IN ENGLISH