హర్షవర్ధన్, 'మిర్చి' కిరణ్, అజయ్, రాజీవ్ కనకాల, హరితేజ, 'షకలక' శంకర్, అలీ రేజా తదితరులు (Cast)
హర్షవర్ధన్ (Director)
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు (Producer)
చేతన్ భరద్వాజ్ (Music)
పీజీ విందా (Cinematography)
Release Date : అక్టోబర్ 6, 2023
ఈ వారం దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో క్రేజ్ ఉన్న సినిమాలు రెండు, మూడు మాత్రమే ఉన్నాయి. అందులో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామా మశ్చీంద్ర’ ఒకటి. ఇందులో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం కనబరచడం.. అలాగే ‘మనం’ వంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండటం తో అందరిలో ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ అయితే పర్వాలేదు అనిపించాయి. మరి సినిమా వాటి స్థాయిలో ఉందో లేదో ఓ తెలుసుకుందాం రండి :
కథ: పరశురామ్ ( వృద్ధ సుధీర్ బాబు) తన చిన్నతనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల వల్ల కఠినంగా మారిపోతాడు.ఎంతలా అంటే… ఆస్తి కోసం తన సొంత మనుషులనే చెంపేసుకునేంత.! ఈ క్రమంలో తన సొంత చెల్లెలు, ఆమె భర్త, పిల్లల్ని కూడా చంపేయమని తన అనుచరుడు దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. కానీ వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అటు తర్వాత పరశురామ్ కూతుర్లు పెద్దవాళ్ళు అవుతారు. ఈ క్రమంలో విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ దుర్గ ( సుధీర్ బాబు(భారీ కాయంతో ఉండే)) సుధీర్ బాబుని ప్రేమిస్తుంది.
అలాగే చిన్న కూతురు మీనాక్షి (మృణాళిని రవి) డీజే (సుధీర్ బాబు) ని ప్రేమిస్తుంది. వీరి లవ్ ట్రాక్ సాగుతూ ఉన్న టైంలో పరశురామ్ కి వీళ్ళ గురించి అసలు విషయం తెలుస్తుంది. తన పై పగతోనే తన మేనల్లుళ్లు ప్లాన్ చేసి తన కూతుర్లను ప్రేమలో పడేశారు అని భ్రమిస్తాడు. అదే టైంలో అతని పై హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ లింక్ ఏంటి? అన్నది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : సుధీర్ బాబు మొదటిసారి ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. తన వరకు మూడు పాత్రలకి న్యాయం చేయడానికి ట్రై చేశాడు. కానీ ఓల్డ్ లుక్ కానీ, కొంచెం బొద్దుగా కనిపించిన లుక్ కానీ అతనికి సెట్ కాలేదు. అందుకే అతను ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఈషా రెబ్బా, మృణాళిని రవి… కొంతసేపు గ్లామర్ వలకబోశారు. అంతకు మించి నటన పరంగా వాళ్ళు కొత్తగా చేసింది అంటూ ఏమీ లేదు. హర్షవర్ధన్ ఎప్పటిలాగే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రాజీవ్ కనకాల, ‘మిర్చి’ కిరణ్, హరితేజ, అజయ్ వంటి వారు కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు : రచయితగా హర్షవర్ధన్ ‘మనం”గుండెజారి గల్లంతయ్యిందే’, వంటి క్లాస్ సినిమాలకి పనిచేసి హిట్లు కొట్టాడు. డైరెక్షన్ ఛాన్స్ ఇతనికి ఎందుకు లేట్ అయ్యింది అనే అనుమానం అందరికీ వచ్చింది. ముందుగా ఇతను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా చేశాడు. అది రిలీజ్ కాలేదు. ‘మామా మశ్చీంద్ర’ అతని మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది. రైటర్ గా తను అనుకున్న పాయింట్ బాగానే ఉంది. అది తెరపైకి వచ్చేసరికి చాలా గందరగోళానికి గురైంది.
హర్షవర్ధన్ కి ప్లస్ పాయింట్ కామెడీ. దానిని పక్కన పెట్టేసి ఏవేవో అనవసరమైన సన్నివేశాలు తెరపైకి తెచ్చాడు. అవి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి అని అతను భావించి ఉండొచ్చు. కానీ కన్ఫ్యూజన్ కి గురి చేసి ఇరిటేట్ చేశాయి.ట్విస్ట్ లు కూడా థ్రిల్ చేయవు. అయితే టెక్నికల్ టీం కి మాత్రం మంచి మార్కులు పడతాయి. పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. కొన్ని డైలుగులు కూడా బాగున్నాయి.
నిర్మాత ఖర్చుకి వెనకాడలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. కానీ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు స్క్రిప్ట్ ల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తె బెటర్. ఇప్పటి వరకు వాళ్ళు చేసినవి ఒక్క ‘లవ్ స్టోరీ’ తప్ప ఏదీ సక్సెస్ కాలేదు. ‘మామా మశ్చీంద్ర’ తో మరో ప్లాప్ వారి ఖాతాలో పడినట్టు అయ్యింది.
విశ్లేషణ : సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేయడం ఒకటి, హర్షవర్ధన్ మార్క్ కామెడీ ఉంటుందేమో అనే ఆసక్తికర విషయం మరొకటి… ఈ సినిమాకి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను థియేటర్ కి తీసుకురావొచ్చేమో కానీ.. వాళ్ళని కూడా ఎంగేజ్ చేసే స్టఫ్ అయితే ఇందులో లేదు.