ఎక్కడో స్విచ్ వేస్తే.. మరెక్కడో బల్బ్ వెలిగినట్లుంది క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితి చూస్తుంటే. హాలీవుడ్ లో హీరోయిన్స్ పై లైంగిక ఒత్తిడి చేస్తున్నారని ఓ నటి ఆరోపిస్తే.. ఇండియాలో చర్చ మొదలయింది. ఆ విషయం ఇక్కడి పరిశ్రమల్లో వివాదాలకు దారి తీస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ లో ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం మానేశారు గానే దక్షిణాది నటీమణులు మాత్రం రోజుకొకరు చొప్పున దీనిపై స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ సమస్యపై పోరాటం కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో హీరోయిన్ మమతా మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “లైంగిక ఒత్తిడి ఎక్కువగా అందమైన అమ్మాయిలకే ఎదురవుతుంటాయి.
అందంగా లేని యువతులు వారి పనులతో వారు సంతోషంగానే ఉంటారు. అందంగా ఉన్న అమ్మాయి సమాజంలో ధైర్యంగా బతకడం కష్టం. ఒక మహిళతో పురుషుడెవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. అతను అలా చేసేలా ఆమే ప్రేరేపించి ఉంటుందని నా అభిప్రాయం. అందరి విషయాల్లోనూ ఇలా జరగకపోవచ్చు. కొందరు మహిళలు హద్దులు మీరి ప్రవర్తిస్తారు. పురుషులు చేసే చిన్న చిన్న కామెంట్లకు అతిగా స్పందించకపోవడమే మంచిది” అని మమత చెప్పింది. ఆమె మాటలపై కొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఓ మహిళ అయి ఉండి ఇతర మహిళల గురించి చులకనగా మాట్లాడతారా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో అనేది ఆసక్తిగా మారింది.