మలయాళ కుట్టీ మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా, సింగర్ గా నిరూపించుకుంది. ఆమెకు చాలా తక్కువ వయసులోనే క్యాన్సర్ వచ్చింది. అయినా నటనకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పి, వైద్యం తీసుకుని ఇప్పుడు ఆరోగ్యవంతురాలు అయింది. మలయాళంలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. అనుష్క చేసిన అరుంధతి కథ మొదట మమత వద్దకు వెళ్ళింది. ఆమె కాదనడంతో అనుష్క చేసింది. స్వీటీ కెరీర్ ని మలుపు తిప్పింది ఈ చిత్రం. అంతటి ఘనవిజయం సాధించిన కథను మమత అప్పుడు ఎందుకు వద్దందో ఎవరికీ తెలియదు. చికిత్స సమయంలో మీడియా ముందుకు రాలేని ఆమెను ఈ ప్రశ్నను ఎవరూ అడగలేదు.
ఇప్పుడు ఆ ప్రశ్నను ఆమె ముందు ఉంచగా ఇలా స్పందించింది. “నాకు సినీ కెరీర్ ప్రారంభంలో సినిమాలంటే అంత గొప్ప ఆసక్తి ఉండేది కాదు. అందువల్లే నాలుగైదు సంవత్సరాలు గందరగోళంగా ఉండేది. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఏది మంచి పాత్రో ముందే తెలుసుకోలేకపోయేదాన్ని. అలాంటి సమయంలోనే “అరుంధతి”ని వదులుకున్నా. అయితే ఆ రెండు నెలల తర్వాత నాకు క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. హాస్పిటల్‌కు వెళ్లి రావడానికే నాకు సమయం సరిపోయేది. ఆ సమయంలో అరుంధతి కంటే బతకి ఉండడం గురించే ఆలోచించేదాన్ని” అని మమతా మోహన్‌దాస్ వివరించింది. ఈమె మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తోంది.