మంచు వారి గారాలపట్టి లక్ష్మీ ప్రసన్న ఇటీవల తన మకాన్ని ముంబయికి మార్చింది. మామూలుగా అయితే అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటుంది. కానీ ఈసారి ముంబయి వెళ్లింది అలా వచ్చేయడానికి కాదు అని అంటున్నారు. ‘‘కొత్త నగరం.. కొత్త దశ.. ఈ కొత్త జీవితం విషయంలో ఆనందంగా ఉన్నా. నన్నెంతగానో నమ్మి, నాకెప్పుడూ అండగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ కాస్త ఎమోషనల్ మెసేజ్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నిజానికి మంచు లక్ష్మి ముంబయి వెళ్లిపోవడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రొఫెషనల్ పనుల నిమిత్తమే ముంబయికి షిఫ్ట్ అవుతున్నానని ఆమె చెప్పారు. దక్షిణాది సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించానని, కాకపోతే కొన్ని పరిమితులకు లోబడే చేశానని ఆమె చెప్పారు. తన లాంటి వారికి ముంబయిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. సినిమాల కోసం ఆడిషన్స్‌లో పాల్గొనడానికి కూడా తాను సిద్ధం అని తేల్చి చెప్పింది. ఇప్పుడే అదే పని చేసింది.
హిందీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేయడానికి తాను సిద్ధమేనని చెప్పిన లక్ష్మీ ప్రసన్న ఆ పనిని ఇంకాస్త పక్కాగా చేయడానికే ముంబయి వెళ్లిపోయింది అంటున్నారు. నటిగా, నిర్మాతగా, టీవీ షో హోస్ట్‌గా, కంటెంట్ ప్రొడ్యూసర్‌గా మంచు లక్ష్మీ ప్రసన్న తెలుగులో మంచి పేరే తెచ్చుకుంది. సౌత్‌లో మిగిలిన భాషల్లోనూ ఆమె ప్రవేశం ఉంది. అయితే ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది అని చెప్పొచ్చు. అయితే మకాం మార్చేసి మరీ ప్రయత్నాలు ఎందుకు అనేదే ప్రశ్న.
‘‘ముంబైలో నేను స్టార్ కిడ్ని కాదు. కొత్తగా పరిశ్రమలోకి ప్రవేశించి యువతిగా సినిమాల కోసం ప్రయత్నిస్తాను. అయినా నా కొత్త ప్రయాణానికి ఇదే సరైన సమయం’’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. నిజానికి తిరిగి లాస్ ఏంజిలెస్ వెళ్లిపోదామని మంచు లక్ష్మి అనుకుందట. అయితే తర్వాత మనసు మార్చుకుని ముంబయికి వచ్చేసింది. బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో (Manchu Lakshmi) మంచు లక్ష్మి ఉన్నట్లు సమాచారం.