మంచు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. తండ్రి మోహన్ బాబు(Mohan Babu) , కొడుకులు విష్ణు(Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) మధ్య కలహాలు బయటకు రావడంతో ఈ గొడవపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తుల విషయంలోనే ఈ వివాదం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విభేదాల మధ్య మంచు లక్ష్మి (Manchu Lakshmi) వ్యవహార శైలిపై అందరి దృష్టి పడింది. మంచు లక్ష్మి గత కొన్ని నెలలుగా ముంబైలో తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఫిల్మ్ నగర్ హంగామా నుంచి పూర్తిగా దూరంగా ఉండే లక్ష్మి, ముంబైలో లగ్జరీ లైఫ్ గడుపుతూ, హై ప్రొఫైల్ పార్టీలలో పాల్గొంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ కుటుంబంలో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చి తండ్రి, సోదరులతో ప్రత్యేకంగా మాట్లాడిన లక్ష్మి, ఈ గొడవలను తీర్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే తన సోదరుల మధ్య పొరపొచ్చాలు తొలగించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలించకపోయింది.
విభేదాలు అధికంగా ఉండటంతో ఎవరూ రాజీ పడేందుకు సిద్ధంగా లేరని అర్థం చేసుకున్న లక్ష్మి, తన ప్రయత్నం విఫలమయ్యిందని భావించి ముంబైకి తిరిగి వెళ్ళిపోయారు. లక్ష్మి కుటుంబానికి ఎటువంటి హాని కలగకుండా విభేదాల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, గతంలో మనోజ్ వివాహ సమయంలో కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య నిలబడి అతనికి మద్దతుగా నిలిచిన లక్ష్మి, ఈసారి సైలెంట్‌గానే ఉన్నారు.
లక్ష్మి తనకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, తండ్రి నిర్ణయాలను గౌరవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య మంచు కుటుంబంలోని విభేదాలు ఇంకా ఎలా పరిష్కరించబడతాయన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.