డిసిప్లిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే మోహన్ బాబు (Mohan Babu) తన తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) పై దాడి చేసినట్లు వార్తలు రావడంతో చాలామంది షాక్ అయ్యారు. మనోజ్ హాస్పిటల్‌కి వెళ్లడం, చికిత్స చేయించుకోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ‘మనోజ్ ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడా’ అని అందరూ వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ‘ఈసారి తండ్రి పై మళ్లీ కంప్లైంట్ ఇస్తాడా?’ అని అనుకుంటే మంచు మనోజ్ మాత్రం యూటర్న్ తీసుకున్నాడు.
సోమవారం సాయంత్రం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మంచు మనోజ్ ఒక రిటన్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదులో తన తండ్రిపై గానీ తన కుటుంబ సభ్యులపై పేర్లను గానీ అతను ప్రస్తావించకపోవడం గమనార్హం. మనోజ్ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత పహాడీ షరీఫ్ సీఐ గురువా రెడ్డి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
మంచు మనోజ్ (Manchu Manoj) తన కుటుంబ సభ్యులలో ఎవరిపైనా కంప్లైంట్ చేయలేదని స్పష్టం చేశారు. జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లుగా ఫిర్యాదులో రాసినట్లు గురవారెడ్డి తెలిపారు. వారెవరో తెలియదని, వారితో దాడి చేయించింది ఎవరో కూడా తనకు తెలియదని మనోజ్ తమకు తెలియజేసినట్లుగా వెల్లడించారు. ఈ దాడిలో తనకు మాత్రమే గాయాలైనట్లుగా మంచు మనోజ్ పేర్కొన్నాడట.
అంతేకాదు, ఒక మెడికల్ రిపోర్ట్ కూడా జత చేసి పోలీసులకు అందజేసినట్లు సమాచారం. అందులో అతని మెడ, భుజం, తొడ భాగంలో తీవ్ర గాయాలైనట్లు రాసి ఉంది. ప్రస్తుతం తనకు, తన ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను మనోజ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే వీరి ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి కొంతమంది పెద్దలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.