మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌క (మా)కు సొంత భవనం… ఈ మాట పట్టుకునే ఏడాది ఎన్నికల్లో దిగారు మంచు విష్ణు ప్యానల్. ఆయన మాటలు విని ఎక్కువమంది సభ్యులు ఆయన ప్యానల్‌కి ఓటు వేసి గెలిపించారు కూడా. ప్రచారం సమయంలో ఓ రోజు విష్ణు ‘ప్లేస్ చూసేశానని, గెలిచిన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తానని’ చెప్పారు. అయితే గెలిచి ఏడాదైనా ఇప్పటివరకు ఆ భవనానికి భూమి పూజ కూడా చేయలేదు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యాఖ్యలు చేశారు విష్ణు.
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా మంచు మోహన్‌బాబుతో కలసి మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ‘మా’ భవనం గురించి ప్రస్తావన వచ్చింది. దానికి విష్ణు చెప్పిన అంశాలే అర్థం కాకుండా ఉన్నాయి. దీనిపై ఒక్కో మీడియాలో ఒక్కోలా వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు విష్ణు ఏమన్నాడు అనేది అర్థం కావడం లేదు. దీంతో అసలు విష్ణు ఏం చెప్పాడు అనే విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇదీ.
‘మా’ సభ్యులు సుమారు 200 మంది కలసి మీటింగ్ పెట్టుకుని ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారట. అందులో విష్ణు రెండు ఆప్షన్లు ఇస్తే.. అందరూ ఏకాభిప్రాయంతో రెండో ఆప్షన్‌కి ఓకే చెప్పారట. ఫిల్మ్‌నగర్ సమీపంలో ఓ భవనం ఉంది. ఆరు నెలలో రెడీ అవుతుంది అనేది తొలి ఆప్షన్ అయితే.. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్‌లోనే బిల్డింగ్ రెడీ చేయడం రెండో ఆప్షన్. ఈ రెండో ఆప్షన్‌కే అందరూ ఓకే చెప్పారని విష్ణు తెలిపారు.
ప్రస్తుతమున్న ఫిలిం ఛాంబర్‌ను కూలగొట్టి కొత్త ఛాంబర్‌ను కట్టాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో అది కూలగొట్టాక.. అందులో కొంత ప్లేస్‌ను తీసుకొని, అందులో ‘మా’ బిల్డింగ్ కడతారట. దీనికయ్యే మొత్తం ఖర్చు తాను పెడతానని విష్ణు తెలిపారు. అయితే దీనికి మూడు, నాలుగేళ్లు పడుతుందని తెలిపారు. అప్పటివరకు గ్యాప్‌లో ‘మా’ నిర్వహణకు ఓ ఆఫీసు ఇస్తానని విష్ణు చెప్పారు. ఇదీ క్లారిటీ.