తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకి చెందిన సైనికుడు సాయి తేజ కుటుంబానికి మంచు ఫ్యామిలీ అండగా నిలిచింది. సాయి తేజ ఇద్దరు పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్,
ఆయన భార్య మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం సంచలనం రేపింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మాత్రం గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా మరణించారు. ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మంచు విష్ణు పరామర్శించారు.
సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు. పది రోజుల్లో మదనపల్లికి వచ్చి సాయితేజ కుటుంబ సభ్యులతో మాట్లాడతానని శ్యామలతో చెప్పారు మంచు విష్ణు.