“ఆర్ ఎక్స్ 100” సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి అనంతరం తెరకెక్కించిన “మహా సముద్రం”తో చతికిలపడ్డాడు. ఆ దెబ్బ నుంచి తేరుకొని స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “మంగళవారం”. పాయల్ రాజ్ పుత్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ టార్గెట్ ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!
కథ: 1996లో గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలోని గోడల మీద ఊర్లో వాళ్ళ రంకు భాగోతాలు ఎవరో రాయడం, ఆ గోడల మీద ఉన్న పేర్లు గల వ్యక్తులు ఆ వెంటనే శవాలుగా కనిపిస్తుంటారు. సరిగ్గా మంగళవారం రోజున జరుగుతున్న ఈ హత్యలను సాల్వ్ చేయడం కోసం లోకల్ ఎస్సై (నందిత శ్వేత) ప్రయత్నిస్తుండగా.. ఊరి జనం కట్టుబాట్ల పేర్లతో ఇన్వెస్టిగేషన్ కు అడ్డంకిగా మారతారు. అసలు ఆ గోడల మీద రాతలు వ్రాస్తున్నది ఎవరు? ఆ హత్యలకు మంగళవారానికి సంబంధం ఏమిటి? ఈ కథలో శైలజ (పాయల్ రాజ్ పుత్) పాత్ర ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “మంగళవారం” చిత్రం.
నటీనటుల పనితీరు: ముందుగా ఈ తరహా డేరింగ్ క్యారెక్టర్ చేసినందుకు పాయల్ ను ప్రశంసించాలి. మరో హీరోయిన్ ఎవరైనా ఈ పాత్రలో నటించడానికి ధైర్యం చేసేవారు కాదేమో. ఓ విపత్కరమైన మానసిక రోగం ఉన్న యువతిగా ఆమె తన కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకుంది. కాకపోతే.. ఆమె పాత్ర సరిగ్గా ఇంటర్వెల్లో పరిచయం కావడం చిన్నపాటి మైనస్ గా నిలిచింది.
ఊరి ప్రెసిడెంట్ గా చైతన్య కృష్ణ భలే ఆకట్టుకున్నాడు. రవీంద్ర విజయ్ పాత్ర బాగున్నా అతడి పాత్రకు నాగార్జున అనే ఆర్టిస్ట్ తో చెప్పించిన డబ్బింగ్ సరిగా సింక్ అవ్వలేదు. అజయ్ ఘోష్ మరోమారు తనదైన తరహా హాస్యంతో ఆకట్టుకున్నాడు. అతడి క్యారెక్టరైజేషన్ & పంచ్ డైలాగులు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తాయి.
శ్రవణ్ రెడ్డి, అజ్మల్ అమీర్ నెగిటివ్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు. ప్రియదర్శి మాత్రం ఆశ్చర్యపరిచాడు. మలయాళ నటి దివ్య పిళ్లై పాత్ర మరియు ఆమె ఆ పాత్రను పోషించిన తీరు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంకేతికవర్గం పనితీరు: పాయల్ ఈ సినిమాకి హీరోయిన్ అయితే.. సంగీత దర్శకుడు అజ్నీష్ లోక్నాధ్ ఈ సినిమాకి హీరో అని చెప్పాలి. తన నేపధ్య సంగీతం & సౌండ్ డిజైనింగ్ తో గగుర్పాటుకు గురి చేశాడు. అందువల్ల.. సినిమాలోని కంటెంట్ కి కాకపోయినా టెక్నికాలిటీస్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఓపెనింగ్ సీక్వెన్స్ మొదలుకొని చివరి షాట్ వరకూ దాశరధి శివేంద్ర తన పనితనంతో ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ సినిమాటిక్స్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా డి.ఐ & లైటింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్త సినిమాని కంటెంట్ తో సంబంధం లేకుండా బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ & సీజీ వర్క్ కథకు తగ్గట్లుగా ఉంది.
ఇక దర్శకుడు అజయ్ భూపతి పనితనం గురించి మాట్లాడుకుందాం.. తాను అసలు తెలుగు సినిమాలు తప్ప మరో భాషా చిత్రాల్ని చూడను అని చెప్పిన అజయ్ “మంగళవారం” మూలకథను “డెయిరీ ఆఫ్ ఏ నింఫోమేనియాక్” (Dairy of a Nymphomaniac) అనే ఫ్రెంచ్ సినిమా నుంచి స్పూర్తి పొందడం గమనార్హం. ఇక సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశం “మలీనా” అనే ఇటాలియన్ సినిమాలోనిది కావడం మరో గమనించదగ్గ విషయం. అలాగే.. కథా గమనం వంశీ గారి “అన్వేషణ” చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది.
ఇలా పలు సినిమాల నుంచి స్పూర్తి పొందినప్పటికీ.. చివరి 30 నిమిషాలు సినిమాను పరిగెట్టించిన విధానం మాత్రం అతడి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ తో ఆడియన్స్ ను విశేషంగా ఎంగేజ్ చేశాడు అజయ్ భూపతి. దర్శకుడిగా అతడి మార్క్ సీన్ కంపోజిషన్స్ మిస్ అయినప్పటికీ.. కథకుడిగా మాత్రం చివరి 30 నిమిషాలతో తన సత్తా చాటుకున్నాడు.
విశ్లేషణ: ఫస్టాఫ్ లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం తీసుకున్న గంట సమయాన్ని కాస్త ఓపిగ్గా చూస్తే.. సెకండాఫ్ మొదలైనప్పట్నుంచి.. మాస్ ఆడియన్స్ పాయల్ నుంచి కోరుకొనే అంశాలు, ట్విస్తులతో విశేషంగా అలరిస్తుంది “మంగళవారం”. మరీ ముఖ్యంగా అజ్నీష్ లోక్నాధ్ నేపధ్య సంగీతం & దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ కోసం (Mangalavaaram )”మంగళవారం” చిత్రాన్ని కచ్చితంగా చూడొచ్చు!