మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత హీరోగా / సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘డేవిడ్ రెడ్డి’. ‘మిరాయ్’ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. సినిమా నేపథ్యం, పేరు చూస్తే ఇది నార్మల్ కమర్షియల్ స్టోరీ కాదు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియా నుండి ఎదురైన ఓ ప్రశ్నకు మనోజ్ ఇచ్చిన ఆన్సర్‌తో మరికొన్ని డౌట్స్ క్రియేట్ అయ్యాయి. అయితే అవి ఎగ్జైట్ చేసేవే.
సౌండ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో మనోజ్ అండ్ టీమ్ ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది. బ్రిటిష్ కాలంలో భారతీయులు అల్లాడిపోతున్నపుడు.. జలియన్‌వాలా భాగ్ ఘటన అనంతరం భారతీయుల గుండెలు మండిపోతున్నపుడు.. 25 కోట్ల మంది కోపాన్ని తనలో నింపుకొని బ్రిటిష్ వాళ్ల మీద దండెత్తిన యోధుడి కథ ఈ సినిమా అంటూ గ్లింప్స్‌లో నెరేట్ చేసి ఉత్సుకతను మరింత పెంచారు. ఆ తర్వాత జరిగిన Q&Aలో ఇంకా ఉత్సుకత పెంచే మేటర్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో కొన్ని కామియోలు ఉన్నాయట కదా.. వాటిలో తమిళ హీరో శింబు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నారట కదా అని అడిగితే.. మనోజ్ రియాక్ట్ అవుతూ ఈసినిమాలో ఆసక్తికరమైన పాత్రలు కొన్ని ఉన్న మాట వాస్తవమే కానీ క్యామియో కోసం రామ్ చరణ్‌ను ఇంకా అడగలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడే సినిమా మొదలవుతోందని నటీనటుల గురించి మాట్లాడడం మరీ తొందర అవుతుందని కామెంట్ చేశాడు. మిగతా విశేషాలు పంచుకోవడం కోసం కొన్ని రోజులు వెయిట్ చేయండి అన్నాడు.
చరణ్ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన శింబు విషయంలో మాత్రం రియాక్ట్ అవ్వలేదు. అంటే ఈ సినిమాలో శింబు నటించడం కన్‌ఫామ్ అనుకోవచ్చు. ఇక ఆయన మాటల ప్రకారం ఈ సినిమాలో ఇంకొన్ని పాత్రలు ఉన్నాయి. అందులో అగ్ర హీరోలే నటిస్తారో లేక మనోజ్ ఫ్రెండ్సే నటిస్తారా అనేది చూడాలి.