తన మీద తాను సెటైర్లు వేసుకోవడంలో రవితేజ చాలా స్పెషల్. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఇంటర్వ్యూలు, ప్రోమోల్లో కూడా అదే పని చేస్తుంటాడు. అలాంటోడు ఎదుటివ్యక్తిని రోస్ట్ చేస్తే.. ఆ మంట చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ మధ్య తన కొత్త సినిమా ‘మాస్ జాతర’ విడుదల తేదీల విషయంలో ఇలాంటి పనే చేశాడు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రవితేజ, హైపర్ ఆది కలసి ఓ ప్రోమోలో మనం ఆ సెటైర్లు, కౌంటర్లు చూశాం. అదంతా సినిమా వాయిదాల నేపథ్యంలోనే సాగింది. ఇంత జరిగినా, ఇంత సెటైర్లు పడినా మళ్లీ సినిమా వాయిదా పడింది అని సమాచారం.
అవును, మీరు చదివింది నిజమే ‘మాస్ జాతర’ సినిమా మళ్లీ వాయిదా పడుతోంది. అయితే ఈ సారి ఎక్కువ రోజులు కాదు.. ఒక్క రోజు మాత్రమే. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది అని చెబుతున్నారు. గతంలో సినిమా పనులు పూర్తవ్వక, విడుదల విషయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడి, రవితేజ అనారోగ్యం బారిన పడటం లాంటి కారణాలతో సినిమా వాయిదా పడతే.. ఈసారి వేరే సినిమా రిలీజ్ ఇంకా చెప్పాలంటే రీరిలీజ్ కారణంగా ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నారు అని సమాచారం.

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో నడుస్తున్న ఓ చర్చ.. ‘బాహుబలి: ది ఎపిక్’ వర్సెస్ ‘మాస్ జాతర’. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ సినిమా విడుదలవుతుంది అని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అలాగే ‘బాహుబలి: ది ఎపిక్’ కూడా అదే డేట్ అని చాలా నెలల కరితమే చెప్పారు. దీంతో ఈ రెండు సినిమాల క్లాష్ చూద్దామని కొందరు, క్లాష్ అవుతాయా లేదా అని మరికొందరు వేచి చూశారు. అయితే ఆ క్లాస్‌కి నిర్మాత నాగవంశీ ఓకే అనుకోవడం లేదట. అంటే సినిమాను ఒక రోజు వాయిదా వేద్దాం అనుకుంటున్నారట.

అలా నవంబర్ 1న ‘మాస్ జాతర’ తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నారట. అక్టోబర్ 31న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని సమాచారం. రాజమౌళి, రవితేజ మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా భారీ విజయం సాధించింది. ఆ అనుంబంధంతోనే ఇప్పుడు తమ సినిమాను ఒక రోజు వెనక్కి నప్పుతున్నారట.
