గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న వరుణ్ తేజ్ (Varun Tej) ‘.. హీరోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఆశయంతో, “పలాస” ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించగా “హాయ్ నాన్న” (Hi Nanna) తో సూపర్ హిట్ అందుకున్న వైరా సంస్థ నిర్మాణంలో నటించిన చిత్రం “మట్కా”(Matka) . నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఫిక్షనల్ స్టోరీ ఇది. ప్రమోషనల్ కంటెంట్ వరకు పర్వాలేదనిపించుకుంది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
Matka Review in Telugu
కథ: బర్మా నుండి పారిపోయి విశాఖపట్నం వచ్చిన 14 ఏళ్ల వాసు (వరుణ్ తేజ్) హత్య కేసులో జైలుకి వెళ్లొచ్చి పూర్ణ మార్కెట్ లో కూలీగా పని చేయడం మొదలెడతాడు. అక్కడ తన ఓనర్ అప్పల రెడ్డి (అజయ్ ఘోష్ (Ajay Ghosh)ను కాపాడడం కోసం అమ్మోరు అనే లోకల్ డాన్ మరియు కెబి (జాన్ విజయ్) (John Vijay) అనే బిజినెస్ మ్యాన్ ను ఎదిరిస్తాడు. అమ్మోరు & కెబి కలిసి వాసును చంపేయబోతుండగా.. ప్రాణాలు కాపాడి తన పంచన చేర్చుకుంటాడు నాని (కిషోర్ (Kishore).
అక్కడ్నుంచి వాసు ప్రయాణం “మట్కా” అనే దేశాన్ని కుదిపేసిన గ్యాంబ్లింగ్ గేమ్ తో సృష్టించే స్థాయికి ఎలా సాగింది? అతడి మీద ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కూడా మండిపడే రేంజ్ లో ఏం చేశాడు? చివరికి ఏమయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
నటీనటుల పనితీరు: వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నాలుగు వేరియేషన్స్ చూపించడం కోసం ఫిజికల్ గానూ చాలా శ్రమించాడు. హావభావాలు, డైలాగ్ డెలివరీ విషయంలో అతడి టైమింగ్ & మెచ్యూరిటీ ఆకట్టుకుంటాయి. ఒక నటుడిగా వరుణ్ తేజ్ ను ఓ మెట్టు ఎక్కించే సినిమా ఇది.
మీనాక్షి చౌదరికి (Meenakshi Chowdary) పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు. ఒక పాట, నాలుగు సన్నివేశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కిషోర్, జాన్ విజయ్ లు తమ రెగ్యులర్ విలన్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు. కథ మొత్తం దాదాపుగా నవీన్ చంద్ర (Naveen Chandra) పాయిటాఫ్ వ్యూలో నడుస్తుంది, అతడి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ పాత్ర సరిగా వర్కవుట్ అవ్వలేదు.
ఇక సత్యం రాజేష్ (Satyam Rajesh), సలోని (Saloni) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా మొత్తంలో హయ్యస్ట్ పెయిడ్ నటి అయిన నోరా ఫతేహి సినిమాలో ఎందుకుందో అర్థం కాదు, ఆమె పాత్ర వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆమెకు పెట్టిన బడ్జెట్ వృధా అనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ టీమ్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకి మెయిన్ హీరోస్. ప్రతి సన్నివేశంలో వారి కష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా.. పూర్ణ మార్కెట్ ను రీక్రియేట్ చేసిన విధానం అమోఘం. ఇక నోట్ల కట్టల దగ్గర నుండి కుర్చీలు, టేబుల్స్ వరకు ప్రతి విషయంలో టైమ్ లైన్ ను మైంటైన్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అయితే.. వారి కష్టానికి సత్ఫలితం లభించలేదనే చెప్పాలి.
జివి ప్రకాష్ (G. V. Prakash Kumar) సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నేపథ్య సంగీతం మాత్రం పర్వాలేదు. కానీ.. సౌండ్ మిక్సింగ్ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ డిసెంట్ గా ఉంది. యాక్షన్ బ్లాక్స్ ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. ఇక ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండొచ్చు.
దర్శకుడు కరుణ కుమార్ నిజ జీవిత పాత్ర నుండి ఫిక్షనల్ స్టోరీ రాసుకున్న తీరు బాగున్నా.. ఆ పాత్ర తాలూకు ప్రయాణాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం అలరించలేకపోయింది. ముఖ్యంగా హీరో ఎదుగుదలను 1952 నుండి 1982 వరకు చూపిన తీరు ఆసక్తికరంగా లేదు. ఒక ప్రయాణంలో ఎత్తుపల్లాలు, లోటుపాట్లు చూపినప్పుడే బాగుంటుంది. ఆ హెచ్చుతగ్గులు ఈ చిత్రంలో లోపించాయి. అలాగే.. కరుణ కుమార్ లోని కథకుడు, అతడిలోని దర్శకుడిని డామినేట్ చేశాడు. అందువల్ల.. రాసుకున్న సన్నివేశాలు, డైలాగుల మీద ప్రేమ ఎక్కువై రాసినవన్నీ తీసుకుంటుపోయాడు.
సెకండాఫ్ లో వరుణ్ తేజ్ కూతుర్ని ఒడిలో పడుకోబెట్టుకుని చెప్పే “మేక – పులి” కథ దాదాపుగా రెండు నిమిషాలు ఉంటుంది. “లైఫ్ ఆఫ్ పై” ఎండింగ్ సీన్ తరహాలో రాసుకున్నప్పటికీ.. సరిగా వర్కవుట్ అవ్వలేదు. ఎవరు నక్క, ఎవరు మేక అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అయితే.. దానికి పే ఆఫ్ గా కూతురు తండ్రి నుదుట ముద్దు పెట్టే సీన్ బాగున్నా పండలేదు. అలా.. రాత పరంగా బాగున్న సన్నివేశాలు తీతలో పట్టు లేక తేలిపోయాయి. సో, కరుణ కుమార్ రచయితగా ఆకట్టుకునే ప్రయత్నంలో దర్శకుడిగా విఫలమయ్యాడు.
విశ్లేషణ: ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ “మట్కా” సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. అయితే.. సినిమాకి కీలకమైన మట్కా ఆటను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఆ ఆట దేశం మొత్తం ఆడేలా ఎలా చేశాడు అనేది సరిగా డీల్ చేసి ఉంటే ఈ చిత్రం తప్పకుండా వరుణ్ తేజ్ కెరీర్లో ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయేది. అది లోపించడంతో ఓ సాధారణ సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: దేశం మొత్తాన్ని ఉరుకులు పెట్టించిన “మట్కా” సినిమాగా మందగమనం కొంప ముంచింది!