“లవ్ టుడ్, డ్రాగన్” సినిమాలతో రెండు 100 కోట్ల సినిమాలు కొల్లగొట్టిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన మూడో చిత్రం “డ్యూడ్”. కీర్తీశ్వరన్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ సినిమాకి మంచి హైప్ ఇచ్చాయి. నిజానికి ఈ దీపావళికి పోటీపడుతున్న సినిమాలన్నిటిలో డ్యూడ్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు జనాలు. మరి సినిమా వారి అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: సర్ప్రైజ్ డ్యూడ్ అనే ఓ ఈవెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తుంటాడు గగన్ (ప్రదీప్ రంగనాథన్). తన మామ కూతురు కుందన (మమిత బైజు)తో కలిసి జనాలకి సర్ప్రైజ్ లు ఇస్తుంటాడు.
చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన గగన్ & కుందనలు వేరు వేరు సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
అయితే.. ఒక్కోసారి ఒక్కోరకమైన సమస్య తలెత్తుతుంది. ఏమిటా సమస్య? చివరికి ఇద్దరు కలిశారా? సినిమాలో తాళికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అనేది “డ్యూడ్” కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రదీప్ కాస్త బాడీ లాంగ్వేజ్ & లుక్స్ విషయంలో వర్క్ చేయాలి. డ్రాగన్ & డ్యూడ్ సినిమాల్లో ఆల్మోస్ట్ ఒకేలా కనిపించాడు. బాడీ లాంగ్వేజ్ కూడా దాదాపుగా అలానే ఉంది. మ్యానరిజమ్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. నటుడిగా మాత్రం ఎప్పట్లానే తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.
మమిత బైజు పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆమె వాటిని చాలా ఎనర్జిటిక్ గా ప్రెజంట్ చేసింది.
శరత్ కుమార్ ఈ సినిమాలో పెద్ద సర్ప్రైజ్. ఆయన క్యారెక్టరైజేషన్ రొటీన్ గానే ఉన్నప్పటికీ.. ఆ పాత్రను ఆయన పోషించిన విధానం మాత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది.
రోహిణి తల్లి పాత్రలో మరోసారి ఒదిగిపోయింది. కీలకపాత్రలో హృదు హరూన్ పర్వాలేదనిపించుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. లైటింగ్, ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఒక ఫ్రెష్ ఫీల్ కలిగించాడు.
సాయి అభ్యంకర్ కూడా తన సంగీతంతో సినిమాకి మంచి మూడ్ క్రియేట్ చేశాడు. అలాగే ఎమోషన్ సీన్స్ ని కూడా బాగా ఎలివేట్ చేశాడు.
ఎడిటింగ్ విషయంలో బృందం ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సీన్ టు సీన్ ఎందుకో సరిగా సింక్ అవ్వలేదు.
ప్రొడక్షన్, ఆర్ట్, కాస్ట్యూమ్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగున్నాయి. ఎక్కడా మీడియం బడ్జెట్ సినిమా అనిపించదు.
దర్శకుడు కీర్తీశ్వరన్ విషయానికి వస్తే.. అతడు ఎంచుకున్న కథ మనం ఇప్పటికే చాలాసార్లు చూసేసాం. అందులో కాస్త కొత్తదనం చూపించడం కోసమే ప్రెగ్నన్సీ/బిడ్డ అంశాన్ని ఇరికించాడు. అది కూడా మోరల్ గా చాలా చిరాకు అనిపిస్తుంది. సినిమా మొత్తం హీరోని మోసపోయిన వెర్రివెధవలా ప్రాజెక్ట్ చేయడం అనేది ఎందుకో నచ్చలేదు. హీరోయిన్ క్యారెక్టర్ కి క్లారిటీ ఉంటుంది. ఆమె ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది అనేదానికి జస్టిఫికేషన్ కూడా ఉంటుంది.
కానీ.. ఆ ఇరికించిన అంశం వల్ల సినిమాకి డిస్కనెక్ట్ అయిపోతాం. దర్శకుడు కీర్తి ఈవెంట్ లో చెప్పాడు.. ఆర్య2 సినిమా చూసి ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని. “ఆర్య 2”లో సుకుమార్ విషయాన్ని తెగేదాకా లాగడు. ఇంతకుమించి లాగితే బాగోదు అని స్వీయ నిబద్ధతతో ఎక్కడా గీతను గీత దాటనివ్వలేదు. కీర్తి ఆ గీత దాటి జెన్ జీని ఏమైనా కనెక్ట్ చేసుకోగలిగాడేమో కానీ.. ఆడియన్స్ ను మాత్రం అలరించలేకపోయాడు. అయితే.. ఆల్మోస్ట్ ప్రతి అంశాన్ని కామెడీగా చూపించి, కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ ను బాగా హోల్డ్ చేసి పర్వాలేదనిపించుకున్నాడు.
విశ్లేషణ: కాన్సెప్ట్ ఒక్కటే బోల్డ్ అయితే సరిపోదు.. దాన్ని డీల్ చేసే విధానం కూడా బోల్డ్ గానే ఉండాలి. ముఖ్యంగా జస్టిఫికేషన్ కన్విన్స్ చేస్తూ.. ఆలోచింపజేయాలి. ఈ విషయంలో “డ్యూడ్” తడబడ్డాడు. దర్శకుడు కీర్తి కథను షేక్ చేస్తుంది అనుకున్న ప్రెగ్నెన్సీ పాయింట్ మైనస్ అయ్యింది. దాంతో దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలన్నీ ఎగ్జిట్ చేయలేకపోయాయి. అయినా.. ఇలాంటి కాన్సెప్ట్ ను ఈవీవీ ఎప్పుడో తీసేశాడు. ఆయన తెరకెక్కించిన “కన్యాదానం, మీ ఆవిడ మీద ఒట్టు.. మా ఆవిడ చాలా మంచిది” సినిమాలకి మించిన బోల్డ్ ఏముంటుంది. అయితే.. ప్రదీప్ రంగనాథన్ కామెడీ టైమింగ్, సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాని టైమ్ పాస్ గా మలిచాయి.
ఫోకస్ పాయింట్: ఆర్య లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు డ్యూడ్!
రేటింగ్: 2.5/5