సినిమాలకు రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదు ఆపేయండి అని కొందరు సినిమా జనాలు అంటుంటే.. మరికొందరేమో ఓ వారం తర్వాత ఇచ్చుకోండి అంటున్నారు.. మీ రేటింగ్‌లతో సినిమాలను చంపేస్తున్నారు అని ఇంకొందరు అంటున్నారు. మా సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇవ్వడానికి మీరెవరు అంటూ ఇంకొంతమంది వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. కుర్ర హీరోల నుండి అగ్ర హీరోల వరకు అందరూ ఇదే మాటలు అంటున్నారు. అయితే ఈ మాటలు కేవలం తెలుగు సినిమాను తెలుగు నేలపై చూసి రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చేవారికేనా?
Tollywood
ఇదేం డౌట్.. అలా ఎందుకు ఉంటుంది.. ఎక్కడి వారు మన సినిమా గురించి మాట్లాడితే టాలీవుడ్ ఇలానే అంటుంది అని అంటారా? అయితే మీరు పరిస్థితుల్ని సరిగ్గా రివ్యూ చేయనట్లే. ఎందుకంటే టాలీవుడ్‌లో రివ్యూలు ఇచ్చువారు రెండు రకములు అనే పరిస్థితి ఏర్పడింది. నచ్చినవారు తక్కువ రేటింగ్ ఇచ్చినా, సినిమా గురించి కాస్త అటు ఇటు అన్నా టాలీవుడ్ పెద్దలు పట్టించుకోవడం లేదు. అదే నచ్చనివాళ్లు ఏమన్నా అర స్టార్ తగ్గించినా అంతెత్తున లేస్తున్నారు.
అందులో విదేశాల్లో ఉంటూ మన కంటే కొన్ని గంటల ముందు సినిమా చేస్తూ ‘నాన్ స్పాయిలర్ రివ్యూ’ పేరిట సినిమా మన దేశంలో విడుదల కాకుండా చంపేసే యూట్యూబ్ ఛానల్స్, మీమ్ పేజీలు, మూవీ ప్రమోషన్ పేజీలను టాలీవుడ్ పెద్దలు, వారి మీడియా రిలేషన్స్ మహానుభావులు ఏమీ అనడం లేదు. ఎందుకంటే ఆ పేజీల ఓనర్లు తెలుగు సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తున్నారు. వారి చేతికి డిస్ట్రిబ్యూషన్ వచ్చిన సినిమాలకు ఒక శాతమో, అర శాతమో మంచి రేటింగ్ కూడా ఇస్తున్నారనే అపవాదు కూడా ఉంది.
ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి. ఎందుకంటే మాకు నచ్చినోళ్లు మా భుజానెక్చొచ్చు అని అనుకుంటే.. రేపొద్దున వాళ్లు నెత్తినెక్కుతారు. ఇప్పుడు ఓటీటీలను చూస్తున్నాం కదా.. ఏకై వచ్చి మేకై టాలీవుడ్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మాట మాది కాండోయ్ సినిమా నిర్మాతలే అంటున్నారు.