మిడిల్ క్లాస్ అబ్బాయి

  • December 21, 2017 / 10:35 AM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “మిడిల్ క్లాస్ అబ్బాయి”. “ఫిదా” ఫేమ్ సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి “ఓ మై ఫ్రెండ్”తో దర్శకుడిగా పరిచయమైన దిల్ రాజు కాంపౌండ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకుడు. మరి ఈ “మిడిల్ క్లాస్ అబ్బాయి” నాని-దిల్ రాజుల హిట్ గ్రాఫ్ కి బ్రేక్ వేశాడా లేక మరిన్ని హిట్స్ కి పేవ్ మెంట్ వేశాడా? అనేది చూద్దాం..!!

కథ : నాని (నాని) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా అన్నయ్య ఆదరణతో ఆనందంగా జీవిస్తుంటాడు. అయితే.. అన్నయ్య జీవితంలోకి భార్యగా, తన జీవితంలోకి వదినగా వచ్చిన జ్యోతి (భూమిక) కారణంగా నాని జీవితంలో చాలా మార్పులొస్తాయి. ఆ మార్పులను నాని జీర్ణించుకోలేకపోతాడు. దాంతో వదినపై కోపం పెంచుకొంటాడు నాని. అప్పట్నుంచి ఆమెను ఇంటి మనిషిలా కాక పరాయి వ్యక్తిగా చూస్తుంటాడు. అయితే.. ఆర్టీఓ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా జ్యోతికి వరంగల్ ట్రాన్స్ ఫర్ అవ్వడం, అదే సమయంలో అన్నయ్య (రాజీవ్ కనకాల) డీల్లీలో ట్రయినింగ్ కి వెళ్లాల్సి రావడంతో.. నాని స్వయంగా వదినకి తోడుగా ఉండాల్సి వస్తుంది.

కానీ.. వదిన పద్ధతులు నచ్చక అక్కడ్నుంచి వెళ్లిపోవాలని చూస్తున్న తరుణంలో నానీకి పరిచయమవుతుంది పల్లవి (సాయిపల్లవి). తన ఇష్టాన్ని వ్యక్తపరచేలోపే పల్లవే వచ్చి తనకి ప్రపోజ్ చేయడంతో ఆమె కోసం వరంగల్ లోనే ఉండిపోతాడు. కట్ చేస్తే.. ఇంత సాఫీగా కథ ముందుకి సాగితే ఎలా చెప్పండి. అందుకే కథలోకి వస్తాడు శివ (విజయ్), “శివ శక్తి ట్రావెల్స్” అధినేత అయిన శివ రావాణా సంస్థ రూల్స్ ఉల్లంఘించి బస్సులు నడుపుతుంటాడు. ఆ విషయాన్ని గుర్తించిన జ్యోతి ఆ సంస్థ బస్సుల్ని సీజ్ చేస్తుంది. అప్పుడు మొదలైన గొడవలోకి అనుకోకుండా ఎంట్రీ ఇస్తాడు నాని. ఇక ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు : నేచురల్ స్టార్ నాని నటన గురించి కొత్తగా ఏం చెబుతాం. ఎప్పట్లానే మిడిల్ క్లాస్ అబ్బాయిగా జీవించేశాడు. ఎమోషనల్ సీన్స్ ను రక్తి కట్టించాడు, కామెడీ సీన్స్ ను ఎలివేట్ చేశాడు. అయితే.. డ్యాన్స్ విషయంలో మాత్రం సాయి పల్లవి తాకిడికి నిలవలేకపోయాడు. “ఫిదా”లో చాలా సహజంగా కనిపించిన సాయిపల్లవి ఈ సినిమాలో కాస్త వింతగా కనిపించింది. ప్రతి సన్నివేశంలో ఎమోషన్ తో సంబంధం లేకుండా ఎగ్జయిట్ మెంట్ తో కనిపించే సాయిపల్లవిని చూసి “ఏమయ్యింది ఈ పిల్లకి” అనుకొంటారు జనాలు. అయితే.. డ్యాన్స్ విషయంలో మాత్రం నానీని డామినేట్ చేయడమే కాక ప్రేక్షకుల్ని “ఏవండోయ్ నాని గారు” సాంగ్ లో ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీయార్ లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో (ఖుషి, ఒక్కడు, సింహాద్రి) నటించిన భూమిక ఈ చిత్రంలో వదిన పాత్రలో ఒదిగిపోయింది. అయితే.. ఎమోషనల్ సీన్స్ లో బ్లాంక్ ఫేస్ ఎందుకు పెట్టిందో అర్ధం కాదు. నరేష్, ఆమని, రాజీవ్ కనకాల, ప్రియదర్శి, రచ్చరవి వంటి ఆర్టిస్టులు తమ తమ పాత్రల్లో ఫర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ క్యాచీగా ఉన్నాయి. ముఖ్యంగా “ఏవండోయ్ నానీ గారు” పాట బెస్ట్ ఆఫ్ ది ఆల్బమ్. కానీ.. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం దేవిశ్రీప్రసాద్ నిరాశపరిచాడు. సన్నివేశంతో సంబంధం లేకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ తో మోత మోగించాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. వరంగల్ అందాలను కళాత్మకంగా చూపించాడు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.

దర్శకుడు వేణు శ్రీరామ్ అలియాస్ శ్రీరామ్ వేణు “మిడిల్ క్లాస్ అబ్బాయి”లో ఒక మధ్యతరగతి అబ్బాయి ఎమోషన్స్ ను చూపించాలనుకొన్న థాట్ ప్రోసెస్ బాగుంది కానీ.. చూపించిన విధానం బాలేదు. కొంచెం కామెడీ, ఇంకొంచెం సెంటిమెంట్, మధ్యలో విలన్ క్లైమాక్స్ లో చిన్న కాన్ఫ్లిక్ట్ అంటూ ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్నీ అంశాలను సరైన మోతాదులో మేళవించి “మిడిల్ క్లాస్ అబ్బాయి” చిత్రాన్ని తెరకెక్కించాలనుకొన్న విధానం బాగుంది కానీ.. వాటిని తెరపై చూపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు శ్రీరామ్ వేణు. నాని మంచి నటుడే, ఎలాంటి ఎమోషన్ అయినా అద్భుతంగా పండిస్తాడు.. కానీ సినిమాలో కంటెంట్ లేనప్పుడు అతను మాత్రం ఎంత భారాన్ని మోయగలడు చెప్పండి. “మిడిల్ క్లాస్ అబ్బాయి” విషయంలోనూ అదే జరిగింది. నానీ వీరాభిమానులు సైతం బోర్ ఫీలయ్యేలా ఉన్న “మిడిల్ క్లాస్ అబ్బాయి” నాని విజయపరంపరకు బ్రేక్ వేసినట్లే.

విశ్లేషణ : క్యారెక్టరైజేషన్ ను బేస్ చేసుకొని కథలు రాసుకోవచ్చు, వాటిని ఆధర్ బ్యాక్డ్ రోల్స్ అంటారు. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ఆ తరహా పాత్రలతో అల్లిన కథలే పెద్ద హిట్ అయ్యాయి. కానీ.. అలాంటి క్యారెక్టర్స్ కు ఆకట్టుకొనే కథ-కథనాలు కూడా చాలా అవసరం. ఈ విషయాన్ని విస్మరిస్తే “మిడిల్ క్లాస్ అబ్బాయి” అవుతుంది.

రేటింగ్ : 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus