“పెళ్ళిచూపులు” చిత్రంతో సెన్సేషనల్ సక్సెస్ తోపాటు నేషనల్ అవార్డ్ అందుకొని టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించిన తరుణ్ భాస్కర్.. రెండో సినిమా “ఈ నగరానికి ఏమైంది”తో ప్రేక్షకుల్ని నవ్వించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు “మీకు మాత్రమే చెప్తా” అనే ట్రాజిక్ కామెడీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం..!!
కథ: రాకేష్ (తరుణ్ భాస్కర్) ఒక సాదాసీదా కుర్రాడు. ఈ తరం కుర్రాళ్ళ లాగే మందు, సిగరెట్ & గర్ల్ ఫ్రెండ్స్ అనేవి చాలా కామన్ గా మైంటైన్ చేస్తుంటాడు. స్నేహితుడు కామేష్ (అభినవ్)తో మాత్రమే అన్నీ విషయాలను పంచుకొంటూ ఉంటాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన స్టెఫీ (వాణి భోజన్)ను పెళ్లాడాలి అనుకొంటున్న తరుణంలో.. తనకు తెలియకుండా చేసిన ఒక వెధవ పని వల్ల ఫిక్స్ అయిన పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంతకీ రాకేష్ చేసిన ఆ వెధవ పని ఏమిటి? రాకేష్-కామేష్ లు కలిసి చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోగలిగారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మీకు మాత్రమే చెప్తా” సినిమా.
నటీనటుల పనితీరు: నటుడిగా తరుణ్ భాస్కర్ ప్రతిభ “ఫలక్ నుమా దాస్” చిత్రంలోనే ప్రూవ్ చేసుకొన్నాడు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. కామెడీ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. కామెడీ అనేది పంచ్ డైలాగులలో మాత్రమే కాదు.. హావభావాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో తరుణ్ ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. అయితే.. కథానాయకుడిగా మొదటి సినిమా కాబట్టి.. తనకు వీలైనంతలో ఆకట్టుకొని అలరించాడనే చెప్పాలి.
సునీల్, వేణుమాధవ్ ల తరహాలో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక సహజమైన కమెడియన్ అభినవ్. ఎలాంటి సన్నివేశాన్నైనా తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పండించగల సత్తా ఉన్న నటుడు అభినవ్. ఈ సినిమాకి సెకండ్ హీరో లాంటివాడు మాత్రమే కాదు.. సినిమా బోర్ కొట్టకుండా ఉండడానికి ముఖ్యకారకుడు అభినవ్.
వాణి భోజన్, అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, అవంతిక మిశ్రాల పాత్రలు కథలో భాగమైనప్పటికీ.. సరైన డెప్త్ తో కూడిన క్యారెక్టరైజేషన్స్ లేకపోవడం వలన వారి పాత్రలు బోర్ కొట్టిస్తాయి. మిగతా పాత్రధారుల నటన కానీ వారి పాత్రలు కానీ ఆకట్టుకొనే స్థాయిలో లేవు.
సాంకేతికవర్గం పనితీరు: శివకుమార్ సంగీతం, మధన్ గుణదేవా కెమెరా పనితనం బాగున్నాయి. కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి అవసరమైనంత ఉన్నాయి. దర్శకుడు షామీర్ కథను హాలీవుడ్ చిత్రం “సెక్స్ టేప్” నుంచి స్ఫూర్తి పొందడం వరకు బాగానే ఉంది కానీ.. మరీ పేలవమైన కథనం మైనస్ గా మారింది. రాసుకున్న కథ నవతరానికి నచ్చుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. పాయింట్ తోపాటు స్క్రీన్ ప్లే మరియు ట్విస్టులు కూడా ఆకట్టుకొనే విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొంటే బాగుండేది. ఫస్టాఫ్ వరకూ పర్వాలేదు కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం బాగా బోర్ కొట్టించేసాడు. సెకండాఫ్ బాగా సాగదీసాడు. అలాగే.. ముఖ్యమైన ఫైనల్ ట్విస్ట్ ను కూడా చాలా సిల్లీగా ముగించడం అనేది అప్పటివరకూ రేగిన ఉత్కంఠను నీరుగార్చింది.
విశ్లేషణ: యువత ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటె ఇంకాస్త బాగుండేది. తరుణ్ భాస్కర్ నటుడిగా తనను తాను ఘనంగా నిరూపించుకున్నాడు.