హీరోయిన్ మీనాక్షి చౌదరి అందరికీ సుపరిచితమే. సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వెంటనే ‘ఖిలాడి’ వంటి పెద్ద సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ‘హిట్ 2’ తో మొదటి హిట్ అందుకుంది. ఆ వెంటనే ఈమెకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో ఛాన్స్ లభించింది. ‘దీంతో ఆమె దశ తిరిగినట్టే.. స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే..!’ అని అంతా అనుకున్నారు. కానీ 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ అనుకున్నంత ఆడలేదు.
అంతేకాదు.. ఆ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర కూడా అందరినీ డిజప్పాయింట్ చేసింది.రాజి అనే పాత్రలో కనిపించిన మీనాక్షి.. ఆ సినిమాలో హీరోయిన్ కి తక్కువ పనిమనిషికి ఎక్కువ అన్నట్టు కనిపించింది. మెయిన్ హీరోయిన్ గా ఆమెను పెట్టినా బాగుణ్ణు అని అంతా అనుకున్నారు. మొత్తంగా 2024 సంక్రాంతి అనేది మీనాక్షి చౌదరికి ఓ చేదు జ్ఞాపకం.
అయితే 2025 సంక్రాంతికి కూడా మీనాక్షి చౌదరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె వెంకటేష్ కి జోడీగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు మీనాక్షి చౌదరి పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. వాస్తవానికి ఇందులో కూడా ఆమె సెకండ్ హీరోయినే.
కానీ సినిమా కథలో అతి కీలకమైన పాత్ర కావడం.. కథని ముందుకు నడిపించే పాత్ర కావడంతో మీనాక్షికి కలిసొచ్చింది. పైగా ఈ సినిమా ప్రారంభమయ్యేది ఆమె పాత్రతోనే, అంతేకాదు ఫస్ట్ ఫైట్ చేసేది కూడా ఆమెనే..! అందుకే మీనాక్షి కెరీర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి.