మెగాస్టార్ లో అదే ఎనర్జీ : రామ్ లక్ష్మణ్

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఫైటర్స్ గా పనిచేశామని, అప్పుడు ఆయన  ఎంత ఎనర్జీగా ఫైట్స్ చేసేవారో ఇప్పుడు అంతే ఉత్సాహంతో యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం “ఖైదీ నంబర్ 150” వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యాక్షన్ సీక్వెన్స్ ని  రామ్ లక్ష్మణ్ లు కంపోజ్ చేస్తున్నారు. రీసెంట్  గా సినిమాలో విశ్రాంతికి ముందు వచ్చే ఫైట్ ని వారి ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ “కొన్నేళ్ల క్రితం చరణ్ బాబు.. నాన్నతో సినిమా చేస్తాను అందుకు ఫైట్స్ కంపోజ్ చేయాలనీ చెప్పారు. చాలా సంతోషించాము.
ఆ తర్వాత అన్నయ్య(చిరంజీవి) రాజకీయాల్లోకి వెళ్లడంతో ఛాన్స్ మిస్ అయిందని బాధపడ్డాం.కానీ అప్పుడు చరణ్ బాబు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మమ్మల్ని తీసుకున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు. అన్నయ్య మేము కంపోజ్ చేసిన ఫైట్స్ కి తన స్టైల్స్ తో రేంజ్ ని పెంచుతున్నారు” అని చెప్పారు. వారు మాట్లాడిన వీడియోని చిత్ర బృందం శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13 న రిలీజ్ చేయనున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus