హీరోగా నిలబడడానికి కష్టపడేవారిని చూసి ఉంటాము. స్టార్ గా పేరు తెచ్చుకోవడానికి సాహసాలు చేసిన వారిని చూసి ఉంటాము. చిన్న పాత్రలు పోషిస్తూ.. ఎవరి అండ లేకుండా సుప్రీం హీరోగా చిరంజీవి ఎదిగారు. మెగా స్టార్ అనిపించుకున్నారు. అవార్డులు.. రికార్డులు అతనికి కొత్త కాదు. కానీ అప్పుడే పరిశ్రమలో అడుగు పెట్టిన యువకుడిలా.. విజయం కోసం పరితపించే కుర్ర హీరోల చిరంజీవి కష్టపడుతుంటే.. ఆశ్చర్యపోవడం చిత్ర యూనిట్ వంతయింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో మెగా ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టారు. అదిరే స్టెప్పులతో విమర్శకుల నోరు మూయించారు. చాలు.. ఇక చాలు అని ఓ మోస్తరు కథతో ముందుకు వెళ్లకుండా అలనాటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గా నటించడానికి సిద్ధమయ్యారు.
సినిమా షూటింగ్ మొదలుకాకముందే కత్తి తిప్పడం, గుర్రపు స్వారీ లో ప్రత్యేక శిక్షణ అందుకున్నారు. ఆ సన్నివేశాలను సులువుగా చేసేశారు. ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, హ్యారీపోర్టర్, స్కై ఫాల్ వంటి అద్భుత చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పని చేసిన గ్రెగ్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ సాగుతోంది. ఈ షూటింగ్ పూర్తి అయ్యే వరకు తెల్లవారు జాము 3 గంటలు అవుతోందంట. అయినా అలసిపోకుండా చిరు యాక్షన్ చేస్తుంటే.. అతని ఎనర్జీ చూసి చిత్ర యూనిట్ సభ్యులు షాక్ తింటున్నారని తెలిసింది. మెగాస్టార్ గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.