మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ డోస్ పెంచింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో దర్శకుడు మెహర్ రమేష్ కూడా పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :
ప్ర) ‘భోళా శంకర్’ ఎలా మొదలైంది?
మెహర్ రమేష్ : 2021 నవంబర్ 15న ‘భోళా శంకర్’ మొదలుపెట్టాం. అన్నయ్య ని డైరెక్ట్ చేయడం అనేది నాకు ఓ డ్రీమ్. ఇప్పటికీ ఆ డ్రీంలోనే ఉన్నాను. ఆగస్టు 11న నా డ్రీం ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది.
ప్ర) చిరంజీవి గారితో మీ అనుబంధం ఎలాంటిది?
మెహర్ రమేష్ : చిన్నప్పటి నుండి అన్నయ్యని దగ్గర నుండి చూసాను. ఆయన సినిమాలు చూస్తూ నేను కూడా దర్శకుడిగా మారాలని అనుకున్నాను. ఆయన మాకు మార్గదర్శకులుగా ఉండటమే కాకుండా ఆయన ఎనర్జీ.. మమ్మల్ని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది.
ప్ర) ఇంట్లో మీరు చూసిన చిరంజీవి గారికి సెట్ లో మీరు చూసిన చిరంజీవి గారికి తేడా ఏమైనా ఉంటుందా?
మెహర్ రమేష్ : అన్నయ్య సెట్ లో ఉన్నప్పుడు ఓ పిక్నిక్ లా ఉంటుంది. ఆయన వెంటనే క్యార్ వాన్ కి వెళ్ళిపోరు. సెట్లో అందరితో కలిసి మెలిసి ఉంటారు. అలాగే దర్శకుడి ఏం కావాలో కూడా ఆయనకు తెలుసు. బాబీకి ఎలా కావాలో అలా మారిపోతారు.. నాకు ఎలా కావాలో అలా మారిపోతారు. అన్నయ్యకి నేను కజిన్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తాను. అన్నయ్యని డైరెక్ట్ చేయడానికే నేను డైరెక్టర్ గా మారాను.
ప్ర) చిరంజీవి గారికి సెట్స్ లో కంఫర్ట్ ఇవ్వడం కోసం ఏమైనా కష్టపడ్డారా?
మెహర్ రమేష్ : లేదు..! అన్నయ్య .. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. మేము ఆయన కోసం కష్టపడింది ఏమీ లేదు. ఆయన ఉంటే మాకు తెలీకుండానే ఓ ఎనర్జీ వచ్చేస్తుంది.
ప్ర) ‘భోళా శంకర్’ షూటింగ్ గురించి చిరంజీవి గారు మీతో ఏం చెప్పారు?
మెహర్ రమేష్ : సినిమా బాగా వచ్చింది. చాలా ఫాస్ట్ గా చేసేసావ్ అని అన్నారు. నిజానికి నేను ఫాస్ట్ ఫిలిం మేకర్ ని. ‘బిల్లా’ సినిమా నాలుగున్నర నెలలో పూర్తి చేశాను. నవంబర్ లో షూటింగ్ మొదలైతే ఏప్రిల్ లో రిలీజ్ చేసేశాం. అలాంటి పెద్ద సినిమా అంత తక్కువ టైంలో తీయడం మాటలు కాదు.ఓ పెద్ద సినిమా షూటింగ్ ను అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం అనేది ఓ రికార్డు. ఇప్పటికీ దానిని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.
ప్ర) ‘భోళా శంకర్’ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు?
మెహర్ రమేష్ : ‘భోళా శంకర్’ కి 120 వర్కింగ్ డేస్ పట్టింది. అంతా పిక్నిక్ లా గడిచిపోయింది.
ప్ర) ‘భోళా శంకర్’ .. ‘వాల్తేరు వీరయ్య’ కంటే ముందు స్టార్ట్ అయ్యిందట.. నిజమేనా?
మెహర్ రమేష్ : అవును నిజమే..! ‘వాల్తేరు వీరయ్య’ కి అన్నయ్య ఫస్ట్ కమిట్ అయ్యారు. అందుకే ‘భోళా శంకర్’ కొంచెం లేట్ అయ్యింది.
ప్ర) మీరు చిరంజీవి గారు కజిన్ కాబట్టి.. సెట్ లో ఆయనే ఎక్కువ శాతం డైరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా?
మెహర్ రమేష్ : అన్నయ్య ఇన్పుట్స్ లేకుండా ఆయన సినిమాలు సెట్స్ కి వెళ్లవు. ఎంత సూపర్ హిట్ రీమేక్ అయినా ఆయన చాలా లెక్కలు వేసుకున్నాకే ఓకే చెబుతారు. నేను అన్నయ్యకి ఓ సీన్ ను 10 రకాలుగా వివరిస్తాను. అందులో ఆయన ఏది బాగుంది అంటే.. అలాగే చేశాను.
ప్ర) చిరంజీవి గారితో ‘వేదాలం’ రీమేకే ఎందుకు? మీ సొంత కథతో సినిమా చేయాలని అనిపించలేదా?
మెహర్ రమేష్ : చిరంజీవి గారు అంటే అందరూ అన్నయ్య అంటూ సంబోధిస్తారు. ‘వేదాలం’ కథలో అన్నయ్య తత్వం ఉంటుంది. అందుకే ఆయనకు ఈ కథ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో చిరంజీవి గారిని చూసి అంతా సర్ప్రైజ్ అవుతారు.
ప్ర) ఒరిజినల్ తో పోలిస్తే ఇందులో ఎంత వరకు మార్పులు చేశారు?
మెహర్ రమేష్ : దాదాపు 70 శాతం మార్పులు చేశాం. అన్నయ్య ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా మార్పులు చేయడం జరిగింది.
ప్ర) ‘వేదాలం’ రీమేక్ ను పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఏ.ఎం.రత్నం ప్లాన్ చేశారు. మరి మీరెందుకు ఆయనతో చేయలేదు?
మెహర్ రమేష్ : అవును పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యి ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ కథ వద్దనుకున్నారో నాకు తెలీదు. నాకైతే ఇది చిరంజీవి గారికి బాగుంటుంది అనిపించింది. ఆయన కంబ్యాక్ ఇచ్చింది.. నా కంబ్యాక్ కోసమే అనిపించింది(నవ్వుతూ). మా ఇద్దరికీ రాసిపెట్టి ఉంది కాబట్టే.. ఈ కథ నా దగ్గరకి వచ్చింది అని నేను నమ్ముతున్నాను.
ప్ర) మహతి సాగర్ తో మ్యూజిక్ చేయడానికి కారణం ?
మెహర్ రమేష్ : మణిశర్మ గారి అబ్బాయి. అతని వార్త ఏంటో నాకు (Meher Ramesh) తెలుసు. చిరంజీవి గారికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో మణిశర్మ గారికి బాగా తెలుసు. వాళ్ళ అబ్బాయి సాగర్ కూడా దాన్ని మణిశర్మ గారి పనితనాన్ని దగ్గరుండి చూశాడు. అందుకే అతన్ని తీసుకున్నాం.
ప్ర) కీర్తి సురేష్ ని చెల్లెలు పాత్రకి తీసుకోవడానికి కారణం?
మెహర్ రమేష్ : ఇందులో ఎమోషనల్ సన్నివేశాలను కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ నటించడానికి కీర్తి సురేష్ కరెక్ట్ అని స్వప్న దత్ సూచించారు.నాకు తను సిస్టర్ లాంటిది. నా సినిమాలో సిస్టర్ పాత్ర కూడా ఆమె వల్లే దొరికింది.(నవ్వుతూ)
ప్ర) నిర్మాత అనిల్ సుంకర గారి సపోర్ట్ ఎలా ఉంది?
మెహర్ రమేష్ : అనిల్ సుంకర గారు చాలా కాలం నుండి చిరంజీవి గారితో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఆయన చిరంజీవిగారితో ఎలాంటి సినిమా తీయాలనుకున్నారో.. అలాంటి సినిమా తీశామని హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన ఖర్చు విషయంలో వెనుకాడకుండా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీకి అలాంటి నిర్మాతలు కావాలి.
ప్ర) ఫైనల్ గా ‘భోళా శంకర్’ గురించి ఒక్క మాటలో ప్రేక్షకులకి ఏం చెబుతారు?
మెహర్ రమేష్ : ఇది అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.