ఆయన పేరు చెబితే రికార్డులు భయపడతాయో లేదో తెలియదు కానీ.. ఆయన డైరెక్ట్ చేసే హీరోల ఫ్యాన్స్ అయితే భయపడతారు. అలా అని ఆయన హీరోను మాసీగా చూపించరా? స్టైలిష్‌గా చూపించరా? అంటే కచ్చితంగా వాటికి మించే చూపిస్తున్నారు. పోనీ ఆయన సినిమాలో కామెడీ ఉండదా? రొడ్డ కొట్టుడు కథ చేస్తారా అంటే అదీ లేదు. కానీ ఆయనతో తమ హీరో సినిమా చేస్తాడు అనే మాట వినగానే ఫ్యాన్స్ భయపెడతారు. ఈ మాటలు ఆ దర్శకుడి మనసును నొప్పించొచ్చు కానీ.. ఆయన సినిమాలు చేసేటప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్లే పెట్టారు సోషల్ మీడియాలో.
ఇంత చెప్పాక ఆ దర్శకుడు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన మెహర్ రమేశ్. తారక్‌తో ‘శక్తి’ సినిమా చేశాక మెహర్ రమేశ్ పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు ఉన్న స్టైలిష్ దర్శకుడు అనే పేరు పోయి.. ఇబ్బందికర దర్శకుడు అనే ట్యాగ్ వచ్చి చేరింది. ఆ ఒక్క సినిమాతోనేనా అంటే ఆ తర్వాత వెంకటేశ్‌తో చేసిన ‘షాడో’ సినిమా అయితే దీనికి డబుల్ భయం కలిగించింది ఫ్యాన్స్‌లో. చాలా గ్యాప్ ఇచ్చి చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమా చేస్తే అదీ భయపెట్టింది. ఆ సినిమాల్లో హీరోను చూపించే విధానం కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.
ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే.. ఆయన ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తా అని అంటున్నారు. ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో ఒకటికి రెండుసార్లు ‘నేను పవన్‌తో సినిమా చేస్తా’ అని గట్టిగా చెప్పారు. సినిమా ఫిక్సయిపోయిందా ఏంటి అని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే.. ‘‘నేను ఫిక్సయ్యా. చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాను.. చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో వంద శాతం సినిమా చేస్తా’’ అని ధీమాగా చెప్పారు మెహర్.
దీంతో అదేదో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాధపడినట్లు ‘ఇదేం ఖర్మరా బాబూ’ అని నెత్తిన చెయ్యి వేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. హీరోను అందులోనూ మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోను మోస్ట్ స్టైలిష్‌గా చూపించాలి అంటే అది టాలీవుడ్‌లో మెహర్ రమేశే. ‘బిల్లా’ ప్రభాస్ లుక్ చూసే ఉంటారు మీరు.