‘ఎఫ్2’ విజయంతో ఊపిరి పీల్చుకున్న మెహ్రీన్..!

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది మెహ్రీన్ పిర్జాదా. అటుతరువాత ‘మహానుభావుడు’ ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్లతో ‘గోల్డెన్ లెగ్’ గా మారిపోయిందనుకున్నారు అంతా. చూడటానికి.. కాస్త స్టార్ హీరోయిన్ కాజల్ లా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా ఉండటంతో.. మెహ్రీన్ మంచి ఆఫర్లు దక్కించుకుని తొందరగానే స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అందరూ భావించారు. అయితే తరువాత వచ్చిన ‘కేరాఫ్ సూర్య’ ‘జవాన్’ ‘పంతం’ ‘కవచం’ చిత్రాలతో వరుస పరాజయాలు కావడంతో మెహ్రీన్ కు ఆఫర్లు కాస్త నెమ్మదించాయనే చెప్పాలి.

అయితే సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ‘ఎఫ్2’ చిత్రంతో భారీ హిట్టందుకుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ‘హనీ’ అనే పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో తమన్నా చెల్లెలిగా… కేవలం గ్లామర్ షోతో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ఆకట్టుకుంది. ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ మెహ్రీన్ చేసిన కామెడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంతో ఊపిరి పీల్చుకుంది మెహ్రీన్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ మల్టీ స్టారర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబతుంది. ఈ చిత్ర విజయం కేవలం మెహ్రీన్ కు మాత్రమే కాదు.., గత సంవత్సరం వరుస ప్లాపులతో నష్టాలు చవి చూసిన దిల్ రాజు కి కూడా చాలా రిలీఫ్ ను ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో మెహ్రీన్ కు మరిన్ని ఆఫర్లు అందుతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus