సంగీత ప్రపంచంలో ధ్రువతార అని పిలిపించుకునే అర్హత నూటికి నూరు శాతం ఉన్న వ్యక్తి మైఖేల్ జాక్సన్. వరల్డ్ మ్యూజిక్ ఆయన వేసిన మార్క్ అలాంటిదే. సంగీతంతోపాటు కొన్ని సంచలనాత్మక విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. దీంతో ఆయన జీవితంపై సినిమా వస్తే బాగుండు.. నేటి తరానికి తెలిస్తే బాగుండు అనే మాట చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. అలా అనుకున్నవాళ్లందరికీ, అందులో మీరూ ఉంటే మీకూ ఓ గుడ్ న్యూస్. మైఖేల్ జాక్సన్ జీవిత కథ సినిమా ఎట్టకేలకు సిద్ధమైంది.
‘మైఖేల్’ పేరుతో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చాలా కాలంగా హోల్డ్‌లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రలో అతని మేనల్లుడే నటించడం విశేషం. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో మైఖేల్‌గా ఆయన మేనల్లుడు, జెర్మైన్ జాక్సన్ కుమారుడు అయిన జాఫర్ జాక్సన్ నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మైఖేల్ పాపులర్ ఆల్బమ్స్‌లో ఒకటైన ‘థ్రిల్లర్’ను విడుదల చేయడానికి రెడీ అవుతున్న సమయంలో.. లెజెండరీ నిర్మాత క్విన్సీ జోన్స్ (కెండ్రిక్ సామ్సన్)తో మైఖేల్ పని చేస్తున్నట్లు టీజర్‌లో చూపించారు.
దీని కోసం మీరు చాలా కాలం వేచి చూశారని మాకు తెలుసు. ట్రాక్స్ పూర్తయ్యాయి, పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మనం మొదటి నుండి మొదలుపెడదాం.. ఇది నీ కథ.. అని సామ్సన్ డైలాగ్ చెప్పడం టీజర్‌లో చూడొచ్చు. అలాగే మైఖేల్ జాక్సన్ ఫొటోలు ఫ్లాష్ వెంటనే అవ్వడమూ చూడొచ్చు. ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యంత ప్రభావవంతమైన ఆర్టిస్టులలో ఒకరి జీవితాన్ని, వారసత్వాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.
ఈ సినిమా అతడి మ్యూజిక్‌నే కాదు.. జీవిత కథనూ చెబుతుంది. స్టేజ్ వెనుక జాక్సన్ జీవితాన్ని, ఐకానిక్ ప్రదర్శనలను హైలైట్ చేస్తుంది అని టీమ్ ఈ మేరకు పోస్టులో పేర్కొంది. ‘మైఖేల్’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలవుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.