ప్రపంచంలో హేటర్స్ లేని యాక్షన్ ఫ్రాంచైజ్ “మిషన్ ఇంపాజబుల్” ఒక్కటే అని చెప్పొచ్చు. మొట్టమొదటి మిషన్ ఇంపాజబుల్ సినిమా 1996లో విడుదలైంది. ఇంచుమించుగా 30 ఏళ్ల ఫ్రాంచైజ్ ఇది. ఈ 30 ఏళ్లలో 8 పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. 2023లో విడుదలైన “మిషన్ ఇంపాజబుల్: డెడ్ రికనింగ్ పార్ట్ 1”కి (Mission Impossible: The Final Reckoning) క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సీక్వెల్ మీద చాలా అంచనాలు నమోదయ్యాయి. అందుకే టీమ్ ఎక్కువ లేట్ చేయకుండా రెండేళ్ల లోపే సీక్వెల్ “మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్”ను (Mission Impossible: The Final Reckoning) రిలీజ్ చేసింది. ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది అనేది చూద్దాం..!!
కథ: పార్ట్ 1 మొత్తం ఒక కీ కోసం ఈథేన్ హంట్ చేసే పోరాటం. ఆ తాళం దొరికాక అతడు ఆ తాళాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని ఎలా కాపాడాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులేమిటి? వాటిని ఎలా అధిగమించాడు? ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్” చిత్రం.
నటీనటుల పనితీరు: మాములుగా ఒక సినిమాలో హీరో యాక్షన్ సీన్స్ చేస్తుంటే ఇంకాస్సేపు చూడాలి అనిపిస్తుంది. కానీ.. మిషన్ ఇంపాజబుల్ సిరీస్ లో టామ్ క్రూస్ యాక్షన్ సీక్వెన్సులు చేస్తుంటే మాత్రం టెన్షన్ తో ఎప్పడు అయిపోతుందా అనే ఫీలింగ్ కలిగిస్తాడు. బహుశా ఇది కేవలం టామ్ క్రూస్ కి మాత్రమే సాధ్యమేమో. నింగి, నేల, పాతాళం, జలగర్భం అని తేడా లేకుండా ప్రతిచోట పీక్ లెవల్ యాక్షన్ బ్లాక్ తో పిచ్చ టెన్షన్ పెట్టాడు.
హేలీ ఆట్వెల్ పెర్ఫార్మెన్స్ మంచి ఎమోషన్ ను యాడ్ చేయగా.. ఏంజెలా బాసెట్ & రాల్ఫ్ సాక్సన్ లను ఈ 8వ భాగంలో చూడడం మునుపటి పార్ట్స్ ను తలపించి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
సాంకేతికవర్గం పనితీరు: యాక్షన్ బ్లాక్స్ & సీజీఐ ఈ సినిమాకి మెయిన్ ఎసెట్స్. అసలు ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టలేదు. నిజంగానే ప్రతి సీన్ క్లైమాక్స్ ఫీల్ కలిగించింది. అందుకు దర్శకుడు, రచయిత, నిర్మాత క్రిస్టఫర్ మెక్వరీని మెచ్చుకోవాలి. ఇప్పటివరకు మిషన్ ఇంపాజబుల్ సిరీస్ సినిమాల్లో ప్రపంచం అంతం అనేది చాలా సార్లు చూపించినప్పటికీ.. ఈ సినిమాలో చూపించినంత రియలిస్టిక్ గా, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా మరే ఇతర సినిమాలో చూపించలేదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఎండింగ్ లో వచ్చే ప్రశాంతత ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. కెమెరా వర్క్ మరో ఎసెట్. ఆండర్ వాటర్ సీక్వెన్సులు, ముఖ్యంగా సబ్ మెరైన్ సీక్వెన్స్ ను షూట్ చేసిన విధానం మంచి థ్రిల్ ఇస్తుంది.
విశ్లేషణ: “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”లో సాయిధరమ్ తేజ్ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని “గబ్బర్ సింగ్” సినిమా ఎన్నిసార్లు చూసావ్ అని మాత్రమే అడగాలి. అలాగే.. “మిషన్ ఇంపాజబుల్” సిరీస్ సినిమాలు కూడా. వీలైనంత టెక్నికల్లీ ఎక్విప్డ్ థియేటర్లో, కుదిరితే దగ్గరలోని ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్ లో ఈ సినిమాని తప్పకుండా చూడండి.
ఫోకస్ పాయింట్: మోస్ట్ ఎగ్జైటింగ్ యాక్షన్ ఫిలిం ఆఫ్ ది ఇయర్!
రేటింగ్: 4/5