ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!

టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ కుటుంబాల్లో ఒక‌టైన మంచు ఫ్యామిలీ లో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరిన‌ట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు (Mohan Babu)  మనోజ్  (Manchu Manoj) మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. లేఖలు రాస్తూ.. ఫిర్యాదులు చేస్తూ.. కేసులు పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. కొద్ది రోజుల క్రితం సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తనకు రక్షణ కల్పించాలని కోరుతూ మోహన్ బాబు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.

Mohan Babu, Manoj:

తాను నివసిస్తున్న బాలాపూర్‌ మండలం జల్‌పల్లి ఇంటిని మనోజ్ అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. తన స్వంత ఆస్తులను వెంటనే ఖాళీ చేయించాలని కోరారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ బాబు, మనోజ్‌లకు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో మనోజ్ ఇప్పటికే హాజరై తన వివరణ ఇచ్చారు. అయితే తాజాగా మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యారు.

సోమవారం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని జిల్లా సమీకృత కార్యాలయానికి వేర్వేరుగా వచ్చారు. ఆ సమయంలో మనోజ్, మోహన్ బాబు ఎదురెదురుగా రావడంతో వాతావరణం కాస్త వేడెక్కింది. ఇక కలెక్టర్ ఇరువురితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక కలెక్టర్ ముందు మోహన్ బాబు తన వాదనను నేరుగా వినిపించారు. “నా స్వార్జిత ఆస్తులు.. ఎవరైనా అక్రమంగా ఆక్రమించడం చట్టబద్ధంగా కరెక్ట్ కాదు” అంటూ స్పష్టం చేశారు మోహన్ బాబు.

మరోవైపు మనోజ్ ..తనకే హక్కులున్నాయని, వాటిని అప్పగించాలని కలెక్టర్‌ ఎదుట స్పష్టం చేశారు. ఇక, జిల్లా కలెక్టర్ ఇప్పటికే పోలీసులు అందించిన నివేదికను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో, తండ్రి – కొడుకుల మధ్య విభేదాలు ఎలా పరిష్కారమవుతాయో వేచి చూడాల్సిందే.

ఇప్పటివరకు కనిపించనంత బోల్డ్ అండ్ పవర్ ఫుల్ పాత్రలో కీర్తి సురేష్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus