టాలీవుడ్లో వచ్చిన కొన్ని గేమ్ ఛేంజింగ్ సినిమాలను పరిశీలిస్తే.. అందులో ‘శివ’ కూడా ఉంటుంది. అక్కినేని నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989 అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘శివ’ చిత్రం. మొదట ఈ సినిమాపై ఆడియన్స్ లో కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో కానీ ఎటువంటి అంచనాలు లేవు. మొదటి రోజు మొదటి షోకి కనీసం 30 శాతం బుకింగ్స్ కూడా లేవు.
కానీ మౌత్ టాక్ తోనే ‘శివ’ ప్రభంజనం మొదలైంది. షో..షోకి జనాలు పెరుగుతూనే ఉన్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సాయంత్రానికి థియేటర్లు పెంచాలనే డిమాండ్ బయ్యర్స్ నుండి వినిపించింది. ఇవన్నీ అక్కినేని నాగేశ్వరరావుని, వెంకట్ ని ఆశ్చర్యపరిచాయి. కానీ నాగార్జునకి కాదు. ఎందుకంటే మొదటి నుండి ఈ కథని నాగార్జున బలంగా నమ్మారు. అందుకే ‘ఈ సినిమాకి ఇది అవసరం’ అని దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే.. వెనుకడుగు వేయలేదు.
ఇందులో భాగంగా మోహన్ బాబు వంటి స్టార్ ను సైతం ఈ ప్రాజెక్టుకి దూరం చేశారట. అదెలా అంటారా? వాస్తవానికి ‘శివ’ సినిమాలో గణేష్ అనే పాత్ర ఉంది. విశ్వనాథ్ అనే నటుడు ఈ పాత్రని పోషించారు. అయితే మొదట ఈ పాత్ర కోసం మోహన్ బాబుని అనుకున్నారట. సన్నివేశం ప్రకారం గణేష్ అనే పాత్ర వెళ్లి శివకి(హీరో నాగార్జునకి) వార్నింగ్ ఇవ్వాలి. దానికి మోహన్ బాబు వంటి నటుడు అయితే కరెక్ట్ అని నిర్మాత అక్కినేని వెంకట్ భావించారట.
కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం.. అలాంటి సన్నివేశంలో మోహన్ బాబుని పెడితే ఆడియన్స్ మోహన్ బాబునే చూస్తారు కానీ రౌడీని కాదు. మోహన్ బాబుని కనుక పెడితే నాగార్జున కనపడరు. అందుకే కొత్త నటుడు అయితే.. ఆ పాత్రలో రౌడీనే ఆడియన్స్ చూస్తారని రాంగోపాల్ వర్మ చెప్పారట. దీంతో కొత్త నటుడు విశ్వనాథ్ ని తీసుకున్నారు. అలా మోహన్ బాబు ‘శివ’ని మిస్ చేసుకున్నట్టు అయ్యింది.