మలయాళంలో విడుదలై.. తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాను మళ్లీ తెలుగులో తీస్తే.. ఇదేంటి మళ్లీ చిరంజీవి అలాంటి కథ ఏదైనా ఓకే చేసేశారా? అనుకుంటున్నారా? కాదు కాదు, ఇప్పుడు మేం చెబుతున్నది చిరంజీవి గురించి కాదు. ఆయన దారిలో నడుస్తూ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్న మోహన్‌బాబు గురించి. అవును, మీరు చదివింది కరెక్టే. ఈ విషయాన్ని చెప్పింది ఆయన తనయుడు మంచు విష్ణునే. కరోనా సమయంలో మలయాళంలో విడుదలై మంచి విజయం అందుకున్న ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ v5.25’ సినిమానే ఇప్పుడు మోహన్‌బాబు చేస్తారట.
‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ v5.25’ సినిమాను ఆహాలో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ పేరుతో ఇటీవల విడుదల చేశారు. ఓటీటీలో తెలుగు వెర్షన్‌కి మంచి స్పందన వచ్చింది కూడా. మోహన్‌బాబు కోసం ఈ రీమేక్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని విష్ణు వెల్లడించారు. సినిమాలో ప్రధాన పాత్రను నాన్న మోహన్‌బాబు పోషిస్తారని చెప్పారు. ఆయన తనయుడి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుణ్ని ఎంపిక చేస్తాం అని కూడా చెప్పారు.
ఆ కథను మాత్రం తీసుకొని, తెలుగు వాతావరణానికి తగ్గట్టు కొన్ని మార్పులు చేస్తున్నాం అని చెప్పిన విష్ణు.. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. మాతృక ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ v5.25’లో సూరజ్ తేలక్కడ్, సౌబిన్ షాహిర్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించారు. రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి తెలుగులో ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి.
‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో ఈ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల్ని పలకరించాడు మోహన్‌బాబు. కూతురు మంచు లక్ష్మీతో కలసి ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ రీమేక్ మొదలవుతుంది. దీంతో సోషల్ మీడియాలో పెదరాయుడు.. ఆండ్రాయిడు అవుతున్నాడు అంటున్నారు.