మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం ‘మరక్కార్’. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తోన్న ఈ సినిమాను పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టయిల్లో చిత్రీకరిస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా విడుదల కావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది ఈ సినిమాకి చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో థియేట్రికల్ రిలీజ్ కోసం సన్నాహాలు పూర్తి చేసిన తరువాత కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది.
కేరళలో థియేటర్స్ తెరుచుకున్న కొన్ని రోజుల్లోనే వంద శాతం ఆక్యుపెన్సీ వస్తుందని భావించారు. కానీ కేరళలో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుంటే కేరళలో మాత్రం వైరస్ ప్రభావం చూపించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడుతున్నప్పటికీ.. మళ్లీ వైరల్ ముప్పు ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో మోహన్ లాల్ తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. అమెజాన్ ప్రైమ్ మంచి డీల్ ఆఫర్ చేయడంతో సినిమా హక్కులు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను చూస్తారని గ్యారెంటీ లేదు. ఆశించిన స్థాయిలో రెవెన్యూ రాకపోవచ్చనే భయంతో ఓటీటీ బాట పట్టినట్లున్నారు. కానీ ఇంతటి భారీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోవడం అభిమానులకు రుచించడం లేదు.