మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అక్కాతమ్ముళ్లుగా నటించిన చిత్రం “మోసగాళ్లు”. మంచు విష్ణు ఎంతో రిస్క్ చేసి దాదాపు ౫౦ కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించడం గమనార్హం. దేశాన్ని కుదిపేసిన ఓ స్కామ్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను తమ వైపుకు తిప్పుకోలేకపోయింది. మరి సినిమా పరిస్థితి ఏమిటి? మంచు విష్ణు రిస్క్ కి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది చూద్దాం..!!

కథ: రాణిగంజ్ స్లమ్ లో పుట్టిపెరిగిన అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్ కిచ్లు) డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బ్రతుకుతుంటారు. అర్జున్ ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తూ అక్కడి డేటాను డార్క్ వెబ్ లొ అమ్మి అడ్డదారిలో సంపాదించడం చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన అతని బాస్ విజయ్ (నవదీప్) ఓ పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి అర్జున్-అనులతో ఓ భారీ స్కామ్ కు తెరలేపుతాడు.

ఇండియాలో ఉంటూ అమెరికన్స్ ను మోసం చేసే కోట్లు సంపాదిస్తారు అర్జున్-అను. అయితే.. వీరి దారికి అడ్డంకిగా నిలుస్తాడు ఎ.సి.పి కుమార్ (సునీల్ శెట్టి). సిస్టంను ప్రభుత్వాన్ని ఎదిరించి అర్జున్-అనులు ఎలా నిలబడ్డారు? వీళ్ళు చేసిన మోసం విలువ ఎంత? వంటి ప్రశ్నలకు సమాధానం “మోసగాళ్లు”.

నటీనటుల పనితీరు: మంచు విష్ణు నటుడిగా ఇంకా ఓనమాల దగ్గరే ఉండిపోయాడు. డిక్షన్ ఇప్పటివరకూ ఇంప్రూవ్ చేసుకోలేదు. ఇక హావభావాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాజల్ కు కాస్త పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఆమె క్యారెక్టరైజేషన్ ప్రోపర్ గా లేదు కానీ.. పెర్ఫార్మెన్స్ మాత్రం ఆకట్టుకొనే స్థాయిలో చేసింది. నవదీప్, నవీన్ చంద్ర లాంటి పొటెన్షియల్ ఉన్న నటులు కూడా ఈ సినిమాలో సరైన నట ప్రదర్శన ఇవ్వలేకపోయారు. సునీల్ శెట్టి చాలా కష్టపడ్డాడు కానీ.. ఫలితం దక్కలేదు. వైవా హర్ష, రాజా రవీంద్ర, రూహి సింగ్ పర్వాలేదనిపించుకున్నారు. తనికెళ్లభరణి పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు: ఈ చిత్రానికి హీరో, నిర్మాత మాత్రమే కాక కథ అందించిన మంచు విష్ణు గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్ అని ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్నుంచి చెప్పుకుంటూ వచ్చారు దర్శకనిర్మాతలు, కథానాయకుడు, రచయిత. అయితే.. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ భారీ స్కామ్ ఎక్కడా కనిపించలేదు. ఏదో అమీర్ పేట్ లో జరిగే స్కిమ్మింగ్ లేదా ఫేక్ కాల్స్ స్కామ్ ను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ.. ప్రపంచపు అతిపెద్ద స్కామ్ చూస్తున్న భావన మాత్రం అస్సలు కలగదు.

మూల కథగా అనుకున్న విషయాన్ని కథ-కథనంలో చూపలేకపోయాడు రైటర్ కమ్ యాక్టర్ మంచు విష్ణు. ఇక హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ సినిమాను తెరకెక్కించిన విధానం చూసాక ఆయన నిజంగా హాలీవుడ్ డైరెక్టరేనా అనే డౌట్ రావడం ఖాయం. సామ్ సి.ఎస్ పాపం ఏదో కష్టపడ్డాడు కానీ.. మనోడి నేపధ్య సంగీతంలో ఉన్న దమ్ము సినిమాలో, సన్నివేశంలో, కథ, కథనంలో లేకుండాపోయింది. ఇక కెమెరా వర్క్ గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం.

సినిమా స్టోరీ పరంగా, టెక్నికాలిటీస్ పరంగా ఎంత వీక్ గా ఉన్నా కూడా సినిమా చూస్తున్నంతసేపూ ఒకటే ఆలోచన.. “యాభై కోట్ల బడ్జెట్ ఎక్కడ, ఎందుకు ఎలా ఖర్ఛైందా?”. ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ ఖర్చు కనిపించలేదు. షూటింగ్ లొకేషన్స్ అన్నీ ఫిలిమ్ నగర్, రామానాయుడు స్టుడియోస్ మినహా ఎక్కడా ఫారిన్ లొకేషన్స్ అగుపించలేదు. మరి ౫౦ కోట్ల బడ్జెట్ ఎలా అయ్యింది అనేది పెద్ద ప్రశ్న.

ఈ ప్రశ్నలు, లాజిక్కులు పక్కన పెడితే.. ఓ అంతర్జాతీయ స్థాయి స్కామ్ ను తెరపై ప్రెజంట్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి క్రియేట్ చేయడం అనేది బేసిక్ రూల్. అలాంటిది సినిమా మొత్తం అనాసక్తిగా సాగుతుంది. అసలు సినిమాలో కంటెంట్ అనేది కనిపించకపోగా.. క్వాలిటీ కూడా లేకపోవడం పెద్ద మైనస్. అంత మంది అద్భుతమైన నటులు, కాజల్ లాంటి పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్ ను పెట్టుకొని తెలుగు-ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో సినిమాను షూట్ చేయడమే కాక తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసినప్పుడు కనీస స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం గమనార్హం.

విశ్లేషణ: విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్, కాజల్ స్క్రీన్ ప్రెజన్స్ మినహా మరో ప్లస్ పాయింట్ అనేది బూతద్దం పెట్టి వెతికినా కనిపించని సినిమా “మోసగాళ్లు”. మంచు విష్ణు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తప్ప ఆయన నటించి, కథ అందించిన “మోసగాళ్లు” చిత్రాన్ని ధియేటర్లలో ఓపిగ్గా చూడడం కష్టం!

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus