తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చిన కొత్తల్లో తెలుగు బాగా వచ్చిన తెలుగువారికి కథానాయికగా అవకాశం ఇచ్చారు. కాంచనమాల, భానుమతి, సావిత్రి, షావుకారు జానకి, కృష్ణకుమారి, జమున.. ఇలా తొలితరం స్టార్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా వాణిశ్రీ, జయసుధ, జయప్రద, జయచిత్ర.. ఇంకా చాలామంది తెలుగువారి గుండెల్లో సంపాదించుకున్నారు. మొన్నటి వరకు అంటే 2000 సంవత్సరం వరకు తెలుగు హీరోయిన్స్ హవా నడిచింది. విజయశాంతి, జీవిత, భానుప్రియ, రంభ, ఆమని, రోజా, రాశి, లయ.. వీరందరూ కమర్షియల్ సినిమాలో నటించి హిట్స్ అందుకున్నవారు. అయితే రెండు దశాబ్దాలుగా తెలుగు భాషలో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో.. తెలుగు అమ్మాయిలు కనిపించడం లేదు. మలయాళం, తమిళం భామలే చక్రం తిప్పుతున్నారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్స్ జోరు ఎక్కువైంది. చిన్న సినిమాలకో.. లేదా పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలకో తెలుగు అమ్మాయిలు పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోకి వస్తున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. తెలుగు స్టార్స్ సైతం తమ కూతుళ్ళని హీరోయిన్స్ గా ప్రోత్సహించడం శుభపరిణామం. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల, జీవిత, రాజశేఖర్ ల తనయురాలు శివాని రాజశేఖర్ నటిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరే కాకుండా అపూర్వ శ్రీనివాసన్, పునర్నవి భూపాలం, ప్రియాంక జవాల్కర్, రీతూ వర్మ, అనీషా ఆంబ్రోస్, ఈషా రెబ్బా, శోభిత ధూళిపాళ, పూజిత పొన్నాడ.. ఇలా హీరోయిన్లుగా తెలుగు అమ్మాయిలు దూసుకు వస్తున్నారు. మరి ఎంతమంది స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారో చూడాలి.