దసరాకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా ఊళ్లకు వస్తుంటారు. దీంతో స్నేహితులు కలుస్తుంటారు. అప్పుడే ఓ రకమైన సందడి నెలకొంటుంది. కలసి ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు.. ఓహో ఆ లెవలే వేరు. మీరు కూడా ఇలాంటివి చూసే ఉంటారు, అందులో పాలుపంచుకునే ఉంటారు. అయితే ఇలా టాలీవుడ్‌లో కూడా ఈ దసరాకు స్నేహితులు కలసి రాబోతున్నారు. అవును అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ దసరాకు టాలీవుడ్ స్టార్ ఫ్రెండ్స్ చిరంజీవి, నాగార్జున కలసి రాబోతున్నారు.
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలు ఒకే సీజన్‌లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్స్ ఆలోచిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దసరాకు వచ్చేస్తున్నాం అంటూ ‘గాడ్ ఫాదర్’ టీమ్ చెప్పగా, మొన్నీ మధ్య ‘ఘోస్ట్’ టీమ్ కూడా ఇదే మాట చెప్పింది. పోస్టర్, పాటల వీడియోను విడుదల చేసింది కూడా. ఇక ‘గాడ్ ఫాదర్’ నుండి 21న టీజర్‌ను తీసుకొస్తున్నారు. ఆ రోజు స్పెషాలిటీ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అదేనండీ 22న చిరంజీవి పుట్టిన రోజు కదా.
చిరంజీవి, నాగార్జున స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగా, వ్యక్తిగత, వ్యాపారాల పరంగా ఇద్దరికీ మంచి స్నేహబంధం ఉంది. అలాంటి వీళ్లు ఇప్పుడు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి, నాగార్జున బాక్సాఫీసు దగ్గర పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటి సిట్యువేషన్ చూడలేదు. ఇప్పుడు ‘ఘోస్ట్2, ‘గాడ్ ఫాదర్’ కలసి రాబోతున్నాయి. నిజానికి బాలకృష్ణ 107వ సినిమా కూడా ఇప్పుడు రావాలి కానీ రావడం లేదు.
చిరంజీవి, నాగార్జున ఒకేసారి థియేటర్లకు వస్తే.. ప్రేక్షకులకు ఆనందమే. దసరా సీజన్ ఫుల్ సరదాగా గడిపేయొచ్చు. రెండు సినిమాలూ విజయం సాధిస్తే ఇండస్ట్రీకి కూడా మంచిదే. మరి అనుకున్నట్లుగా ఈ ఇద్దరూ థియేటర్ల దగ్గరకు వస్తే ఎవరిది పై చేయి అవుతుంది అనేది ఆసక్తికరం. చూద్దాం టాలీవుడ్‌లో మోస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ త్వరలో రాబోతోంది.