చిత్ర పరిశ్రమ వారికి వేసవి మంచి సీజన్. పాఠశాలలకు, కాలేజీలకు 50 రోజుల సెలవుల్ని వినియోగించుకోవాలని నిర్మాతలు అనుకుంటారు. అందుకే ఆ సీజన్ లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపు డజను సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ మార్చి16 న రిలీజ్ అవుతుండగా, ఇజం తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న ఎమ్మెల్యే మార్చి 23 న థియేటర్లోకి రానుంది. మార్చి 30 న సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం విడుదల కానుంది. చెర్రీ సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది విడుదలైన వారం రోజులకే (ఏప్రిల్ 5 ) నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా వస్తోంది.
త్రివిక్రమ్, పవన్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమా కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 న నాని సినిమా కృష్ణార్జున యుద్ధం రిలీజ్ కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-కొరటాల చేస్తున్న సినిమాగా భరత్ అనే నేను ఏప్రిల్ 20 న సందడి చేయనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 27 న రజనీకాంత్ కాలాగా వస్తున్నాడు. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న నా పేరు సూర్య మే 4 న థియేటర్లలోకి రానుంది. వీటితో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ “సాక్ష్యం” (మే 12 ), విజయ్ దేవరకొండ “టాక్సీ వాలా” (మే 18 ), గోపీచంద్ “పంతం” (మే 19 ) చిత్రాలు సందడి చేయనున్నాయి. మరి వీటిలో ఏ మూవీ హిట్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.