Mr.Pregnant Movie Review in Telugu: మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సొహైల్ (Hero)
  • రూప కొడవయూర్ (Heroine)
  • సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్ (Cast)
  • శ్రీనివాస్ వింజనంపాటి (Director)
  • అప్పిరెడ్డి-సజ్జల రవిరెడ్డి - వెంకట్ అన్నపరెడ్డి (Producer)
  • శ్రవణ్ భరద్వాజ్ (Music)
  • నిజార్ షఫీ (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 18, 2023

బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు సుపరిచితుడైన సొహైల్ కథానాయకుడిగా నటించిన చిత్రం “మిస్టర్ ప్రెగ్నంట్”. మగాడు “ప్రెగ్నంట్” అయితే అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం చక్కని ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్లింది. ముఖ్యంగా.. మొన్నామధ్య 200 మందికిపైగా గర్భవతులను థియేటర్ కి తీసుకొచ్చి సినిమా చూపించడం అనేది మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఏస్థాయిలో అలరించిందో చూద్దాం..!!

కథ: సిటీలో మంచి ట్రెండింగ్ టాటూ ఆర్టిస్ట్ గౌతమ్ (సొహైల్). తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ & ఫేమ్ ఉన్న గౌతమ్ ను మహి (రూప కొడవయూర్) ఘాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆమె ఇంటి నుండి బయటకి వచ్చేస్తుంది.

కట్ చేస్తే.. అసలు పిల్లలే వద్దనుకున్న గౌతమ్-మహి దంపతులు కన్సీవ్ అవుతారు. అయితే.. బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్.

అసలు గౌతమ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఒక మగాడు గర్భవతి అయితే సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది? గర్భం దాల్చిన గౌతమ్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? అనేది “మిస్టర్ ప్రెగ్నంట్” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా సొహైల్ ఒక మెట్టు ఎక్కాడు. ఫస్టాఫ్ మొత్తం తన రెగ్యులర్ హైపర్ యాక్టింగ్ తో లాక్కొచ్చేసిన సొహైల్.. సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా.. గర్భవతిగా జాగ్రత్తగా వ్యవహరించే సొహైల్ నటన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. అలాగే.. గర్భవతులైన మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను, కష్టాలను అతడు తన నటనతో ప్రొజెక్ట్ చేసిన తీరు ప్రశంసనీయం. మహిళలు బాగా కనెక్ట్ అవుతారు.

నటిగా రూప కొడవయూర్ మరోమారు ఆకట్టుకుంది. అయితే.. ఆమెకు మేకప్ చాలా సన్నివేశాల్లో తేలిపోయింది. ఆమెను సహజంగా చూపించి ఉంటే ఇంకా అందంగా కనిపించేది.

వైవా హర్ష ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో ఇరగ నవ్వించాడు. బ్రహ్మాజీ, అభిషేక్ ల పాత్రల ద్వారా కూడా మంచి ఫన్ క్రియేట్ అయ్యింది.

చాన్నాళ్ల తర్వాత సుహాసినికి మంచి పాత్ర లభించింది. రాజా రవీంద్ర పాత్ర చిన్నదే అయినా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: శ్రవణ్ భరద్వాజ్ సంగీతం & నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. సదరు పాటల చిత్రీకరణ సంగీతం స్థాయిలో లేకపోయినప్పటికీ.. పాటలన్నీ వినసోంపుగా ఉన్నాయి. నేపధ్య సంగీతం మాత్రం హృద్యంగా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు శ్రవణ్. అలాగే.. క్లైమాక్స్ లో డైలాగ్ ఎలివేషన్ కోసం అతడు ఇచ్చిన పాజ్ లు, సందర్భాన్ని ఎలివేట్ చేయడం కోసం సంగీతం కంటే సైలెన్స్ ను కొన్ని చోట్ల వినియోగించిన తీరు బాగుంది.

నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా సినిమా మూడ్ కి తగ్గట్లుగా లైటింగ్ & టింట్ కలర్ ను మార్చుకున్న తీరు ఆడియన్స్ ను సినిమాకి బాగా కనెక్ట్ చేస్తుంది. అలాగే సినిమా బడ్జెట్ ను పరిగణలోకి తీసుకున్నప్పుడు నిజార్ షఫీ పనితనం మెచ్చుకోవాల్సిందే.

ప్రొడక్షన్ డిజైన్ కథకు తగినట్లుగా ఉంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. కాస్ట్యూమ్స్ మాత్రం ఎమోషన్ తో సంబంధం లేని విధంగా ఉన్నాయి. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొనుంటే.. సన్నివేశాలు ఇంకాస్త సహజంగా ఉండేవి.

దర్శకుడు శ్రీనివాస్ ఎంచుకున్న కథ, ఆ కథను నడిపించిన విధానం బాగున్నాయి. అయితే.. ప్రతి పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరానికి మించిన సమయం తీసుకున్నాడు. అలాగే.. కామెడీ కొన్ని చోట్ల వర్కవుటవ్వలేదు. కాకపోతే.. అవకాశం ఉన్నా ఎక్కడా కూడా అసభ్యకరమైన కామెడీని ఇరికించకుండా చిత్రాన్ని నడిపించిన విధానం మాత్రం ప్రశంసనీయం. అలాగే.. సినిమా ద్వారా ఆడవాళ్ళు గర్భస్త సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను హృద్యంగా తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. ఇక క్లైమాక్స్ లో మాత్రం కంటతడి పెట్టించాడు.

ఇలా ఇన్ని ప్లస్ పాయింట్ ఉన్నప్పటికీ.. ఫస్టాఫ్ లో ఇరికించిన కొన్ని కామెడీ సీన్స్ & సెకండాఫ్ లో కాస్త ఓవర్ డ్రమటైజ్ చేయడం వల్ల సినిమా ఎమోషనల్ కనెక్టివిటీని కోల్పోయింది. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యి.. దర్శకుడిగా శ్రీనివాస్ కు మంచి పేరు వచ్చేది.

విశ్లేషణ: రొటీన్ సినిమాలు చూసీ చూసీ బోర్ కొట్టిన ప్రేక్షకులు చూసి కాస్త కొత్తదనాన్ని ఆస్వాదించగలిగే చిత్రం “మిస్టర్ ప్రెగ్నంట్”. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సొహైల్ నటన, ఎమోషనల్ సీన్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా ఒకసారి చూసే ప్రయత్నం చేయొచ్చు.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus