MS Narayana : ఇచ్చిన మాట తప్పలేక మొత్తం ఆస్థి అమ్మేసిన MS నారాయణ.. షాకింగ్ విషయాలు చెప్పిన కూతురు
- January 30, 2026 / 02:52 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమా తెరపై నవ్వుల తుఫాన్ సృష్టించిన పేరు MS నారాయణ. వందల సినిమాల్లో కనిపించి, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన, ఎక్కువగా మద్యం తీసుకున్న పాత్రల్లో కనిపించిన కారణంగా, నిజ జీవితంలో కూడా ఆయన అలానే ఉంటారని చాలామందికి ఓ అపోహ. కానీ ఆ నటన వెనుక ఉన్న వ్యక్తిత్వం మాత్రం పూర్తిగా భిన్నం.
MS Narayana
ఇటీవల ఆయన కుమార్తె శశికిరణ్ నారాయణ చెప్పిన మాటలు వింటే, ఎం.ఎస్. నారాయణ ఎంత నిరాడంబరంగా జీవించారో అర్థమవుతుంది. అన్ని సంవత్సరాల కెరీర్లో షూటింగ్‌కు వెళ్లే ముందు కానీ, సెట్స్‌లో కానీ మద్యం అలవాటు లేదని, పని పూర్తయ్యాక ఇంటికి వచ్చి కుటుంబంతో ప్రశాంతంగా గడిపే మనిషని ఆమె గుర్తుచేసుకున్నారు. స్టార్ నటుడైనా విలాసాలకు దూరంగా, సాధారణ జీవితం గడపడం ఆయన నైజం.

తన కొడుకు విక్రమ్ హీరోగా చేసిన సినిమా విషయంలో “ఇచ్చిన మాట తప్పకూడదు” అనే సిద్ధాంతం కోసం ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తానే ముందుకు వచ్చి రిలీజ్ చేస్తానని చెప్పి, ఆ మాట కోసం తన సంపాదనలోని చాలా భాగాన్ని త్యాగం చేశారు. ఆస్తులు పోయినా, కుటుంబానికి “మన దగ్గర విలువలు ఉన్నాయి” అనే ధైర్యం మాత్రం ఇచ్చారు.
ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎస్. నారాయణ చెప్పిన మాటలు ఆయన జీవనతత్వాన్ని చెప్పకనే చెబుతాయి. “కష్టపడితేనే విజయం వస్తుంది. అంతేకానీ రంగురాళ్లు చేతికి పెట్టుకుంటే కాదు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆస్తులు కాదు.. ఇచ్చిన మాట, విలువలే నిజమైన సంపద అని ఆయన జీవితం చెప్పిన పాఠం.













