టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందే నెగటివ్ రివ్యూలు రావడం.. బాట్లతో రేటింగ్స్ తగ్గించడం వంటి పనులు జరుగుతుంటాయి. దీనికి చెక్ పెట్టేందుకు చిరు సినిమా టీమ్ కోర్టును ఆశ్రయించి.. ఒక లీగల్ షీల్డ్ ను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ గా బుక్ మై షో లో ఈ సినిమా పేజీ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ కనిపిస్తోంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రేటింగ్స్.. రివ్యూలను డిసేబుల్ చేశామంటూ అక్కడ స్పష్టంగా ఉంది. ఇలా ఒక సినిమాకు న్యాయపరమైన రక్షణ కల్పించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఉద్దేశపూర్వకంగా సినిమాను దెబ్బతీసే వారి ఆటలు సాగకుండా ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాల మీద కావాలనే నెగటివ్ క్యాంపెయిన్స్ నడుస్తున్నాయనే ఆందోళన నిర్మాతల నుంచి వినిపిస్తోంది. ఫేక్ అకౌంట్లు.. ఆటోమేటెడ్ బాట్లను వాడుతూ సినిమా విడుదలైన కొన్ని నిమిషాలకే తప్పుడు రివ్యూలు ఇస్తున్నారని వారు వాపోతున్నారు. దీనివల్ల ప్రేక్షకుల్లో సినిమా పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పడి భారీ నష్టాలు వస్తున్నాయి. అందుకే ఈసారి మన శంకర వరప్రసాద్ గారు టీమ్ ముందే అప్రమత్తమై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సరైన ఆధారాలు లేకుండా.. కేవలం సినిమాకు నష్టం కలిగించడమే లక్ష్యంగా చేసే రివ్యూలను పరిమితం చేయాలని చెప్పింది. అలాగే బాట్ల ద్వారా రేటింగ్స్ తగ్గించే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ కు సూచించింది. దీంతో ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తున్న చిరు సినిమాకు ఒక గట్టి భద్రత దొరికినట్లయింది.
