సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో కంగన రనౌత్ సృష్టించిన అలజడి గురించి మీకు తెలిసిందే. బాలీవుడ్‌లో కొందరి ఆధిపత్యం, బంధు ప్రీతి వల్లే సుశాంత్ తనువు చాలించడాని విమర్శించింది కంగన. ఈ నేపథ్యంలో వివిధ టీవీ ఛానల్స్‌లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల మీద కామెంట్స్ చేసింది. అందులో ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కూడా ఉన్నారు. దీంతో ఆయన కంగన మీద పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ వ్యవహారంలో కంగనకు ముంబయి కోర్టు బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
జావేద్ అక్తర్ నాయకత్వంలో బాలీవుడ్‌లో ఓ కోటరీ నడుస్తోందంటూ కంగన విమర్శించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో వారి వల్లే ఇలాంటి ఘటనలు చోటు జరుగుతున్నాయంటూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహారంలో కంగన వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ అప్పుడే తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ విషయంలో తాను కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. తర్వాత అంధేరి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో మార్చి 1న కోర్టు ఎదుట హాజరు కావాలని కంగనకు కోర్టు సమన్లు జారీ చేసింది.
అయితే సమన్లపై కంగనా రనౌత్ స్పందించకపోవడంతో బాంద్రా కోర్టు తీవ్రంగా స్పందించింది. దీంతో కంగనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం కేసు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. దీంతో బాలీవుడ్‌లో మరోసారి కంగన టాపిక్ చర్చకు వచ్చింది. కామెంట్లు చేయడం తేలిక… వాటి పర్యవసానాలు ఎదుర్కోవడం కష్టం అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది కంగన ఇలాంటి వాటికి భయపడేరకం కాదని రాస్తున్నారు.